DGCA: ఉద్రిక్తతల వేళ కమర్షియల్ ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ ఆదేశాలు

by Shamantha N |

భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ కమర్షియల్ ఎయిర్ లైన్స్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక సూచన చేసింది. రక్షణశాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయంలో విండో షేడ్స్‌ ను మూసివేయాలని ఆదేశించింది.

DGCA: ఉద్రిక్తతల వేళ కమర్షియల్ ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ కమర్షియల్ ఎయిర్ లైన్స్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక సూచన చేసింది. రక్షణశాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయంలో విండో షేడ్స్‌ ను మూసివేయాలని ఆదేశించింది. మరీ ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు ఉన్న ఎయిర్ పోర్టుల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విమానం టేకాఫ్‌ అయిన తర్వాత 10వేల అడుగుల ఎత్తుకు వెళ్లేవరకు, ల్యాండింగ్ సమయంలో ఈ ఎత్తుకు దిగిన తర్వాత ఆ నిబంధన వర్తిస్తుంది. ఎమర్జెన్సీ కిటికీల దగ్గర మాత్రం ఇందుకు మినహాయింపు ఉందని తెలిపింది. అంతేకాకుండా, సైనిక స్థావరాల వద్ద ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉన్న నిషేధం గురించి ప్రయాణికులను అప్రమత్తం చేయాలని సూచించింది. వాటిని ఉల్లంఘించిన ప్రయాణికులు తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విమానయాన సంస్థల నిర్వాహకులకు స్పష్టంచేసింది. ఆపరేషనల్ సేఫ్టీతో పాటు ప్రయాణికులు తమకు తెలియకుండానే రక్షణపరమైన సమాచారాన్ని షేర్ చేయకుండా నిరోధించేందుకే ఈ చర్యలని తన ప్రకటనలో పేర్కొంది.

దౌత్యపరమైన ఉద్రిక్తతలు..

మరోవైపు, పాక్- భారత్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిరినప్పటికీ.. దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే.. పాకిస్థాన్‌కు చెందిన విమానాలు భారత గగనతలాన్ని వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. గతంలో విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో, నిషేధాన్ని జూన్‌ 23 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. భారత విమానాలకు గగనతల మూసివేతను పాకిస్థాన్‌ మరో నెల పాటు పొడిగించింది. కాగా.. ఈ నేపథ్యంలోనే డీసీజీఏ ఈ ప్రకటన వెలువరించింది.

Next Story