- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరండా అడవుల్లో గగనతల దాడులు.. మావోయిస్టు కమిటీ సంచలన ఆరోపణలు
సరండా అరణ్య ప్రాంతం, పరిసర గ్రామాలపై భద్రతా బలగాలు నిరంతర గగనతల దాడులు నిర్వహిస్తున్నాయని బాజ్పా మావోయిస్టు బీహార్–జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: సరండా అరణ్య ప్రాంతం, పరిసర గ్రామాలపై భద్రతా బలగాలు నిరంతర గగనతల దాడులు నిర్వహిస్తున్నాయని బాజ్పా మావోయిస్టు బీహార్–జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధి సత్యం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పలు సంచలన ఆరోపణలు చేశారు.
2021 జనవరి 21 నుంచి సీఆర్‌పీఎఫ్ డీజీ జి. ప్రతాప్ సింగ్ నేతృత్వంలో బాలిబా, త్రిల్పోసి, డిగ్గా, బాబుడేరా అరణ్య ప్రాంతాల మధ్య ఉన్న గ్రామాలపై భారత సైన్యం, భద్రతా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయని కమిటీ పేర్కొంది. రోజూ గగనతల దాడులు జరుగుతున్నాయని, ఇవి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించింది. ఈ దాడులను తమ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వెల్లడించింది.
ఆదివాసీ గ్రామాలపై కాల్పులు
ఆదివాసీ గ్రామాలపై అకస్మాత్తుగా గగనతల దాడులు, గుడ్డిగా కాల్పులు జరపడంతో ప్రజలు భయంతో గ్రామాలు విడిచి పారిపోతున్నారని కమిటీ తెలిపింది. ఈ పరిస్థితి గ్రామీణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు దారితీస్తోందని పేర్కొంది.
డీజీ ప్రకటించిన నిర్ణయాత్మక దాడుల తర్వాత.. 2020 జనవరి 22న కోబ్రా 209, జార్ఖండ్ జాగ్వార్, జిల్లా పోలీసులు కలిసి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని కమిటీ గుర్తుచేసింది. అయితే ప్రజలకు భద్రత కల్పించాల్సిన చర్యలు, వారి ప్రాణాలకే ముప్పుగా మారాయని విమర్శించింది.
జీపీఎస్ ట్రాకర్లతో ఉచ్చు – 17 మంది సహచరుల హత్య
జీపీఎస్ ట్రాకర్లను ఉపయోగించి తమ సహచరులను ఉచ్చులో పడేసి హతమార్చారని కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రసిమ్ ముట్బెడ్ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ, బీహార్–జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ నాయకులు ఉరూప్ హండాల్, ఉరూప్ రమేశ్ సహా మరో 17 మంది సహచరులు ఇదే విధంగా హత్యకు గురయ్యారని తెలిపింది. మిగిలిన సహచరులను కూడా ఒక్కొక్కరిని హతమారుస్తున్నారని, ఇంకా ముగ్గురు తమ అదుపులోనే ఉన్నారని పేర్కొంది. వారికీ ప్రాణహాని ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ స్థాయి దర్యాప్తుకు డిమాండ్
ఈ ఘటనలపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరపాలని కమిటీ డిమాండ్ చేసింది. గతంలో కూడా జీపీఎస్ ట్రాకర్ల ద్వారా తమ పాఠశాలలు, భవనాలపై దాడులు జరిగాయని, భారీ నష్టాలు ఎదురయ్యాయని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో భద్రతా బలగాలకూ నష్టాలు జరిగినట్లు పేర్కొంది.
“పిరికిపంద చర్యలు” : కమిటీ ఖండన
ఈ దాడులను “పిరికిపంద, విధ్వంసకర చర్యలు”గా అభివర్ణించిన కమిటీ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. తాము మానవతావాద, విప్లవాత్మక, జాతీయవాద సంస్థ అని పేర్కొంది.
ప్రజలకు పిలుపు
ఈ హింసాత్మక చర్యలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు, రైతులు, కార్మికులు, యువత, పేదలు, వృద్ధులు, పౌరులు, శ్రమజీవులందరూ గళం విప్పాలని కమిటీ పిలుపునిచ్చింది. ఉగ్రదాడులు, హింసను నిరసిస్తూ ప్రజా ప్రతిఘటన బలంగా సాగాలని విజ్ఞప్తి చేసింది.






