ఎయిరిండియా విమాన ప్రమాదం.. మధ్యంతర నివేదికను తోసిపుచ్చిన కేంద్రం

by Kema Shiva Kumar |

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై మధ్యంతర దర్యాప్తు నివేదిక (Interim Report) ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎయిరిండియా విమాన ప్రమాదం.. మధ్యంతర నివేదికను తోసిపుచ్చిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జరిగిన ఎయిరిండియా (Air India) విమాన ప్రమాద దర్యాప్తునకు సంబంధించి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసున్నది. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై లాంటి తాత్కాలిక, మధ్యంతర దర్యాప్తు నివేదికను (Interim Probe Report) విడుదల చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్న దేశీయ అత్యున్నత విమాన ప్రమాదాల పరిశోధనా సంస్థ ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (AAIB), ప్రస్తుతం నేరుగా పూర్తి స్థాయి సమాచారంతో కూడిన తుది నివేదికను (Final Report) సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

తుది నివేదిక ఎప్పుడంటే..

అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ కేసుకు సంబంధించిన టెక్నికల్ డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (Black Box) విశ్లేషణలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. మధ్యంతర నివేదికతో తప్పుడు ప్రచారాలు (Speculations) జరిగే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావించారు. అందుకే నేరుగా పూర్తి స్థాయి నివేదికను విడుదల చేయడమే ఉత్తమమని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం AAIB నిపుణుల బృందం విమాన తయారీ సంస్థ ఇంజనీర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) రికార్డులు, నాటి వాతావరణ పరిస్థితులను సమగ్రంగా సేకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన కఠినమైన సిఫార్సులతో కూడిన ఫైనల్ రిపోర్ట్ మరికొద్ది వారాల్లోనే ప్రభుత్వానికి AAIB అందించనుంది. వచ్చే రిపోర్టు ఆధారంగానే బాధ్యులపై తదుపరి చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పౌర విమానయాన శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story