రన్‌వేను తాకిన ఎయిరిండియా ఫ్లైట్ టెయిల్ పార్ట్.. తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |

ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదమే తప్పింది.

రన్‌వేను తాకిన ఎయిరిండియా ఫ్లైట్ టెయిల్ పార్ట్.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌‌‌‌డెస్క్: ఢిల్లీ (Delhi) నుంచి బెంగళూరు (Bengaluru) వచ్చిన ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం తోక భాగం రన్‌వేను బలంగా ఢీకొట్టింది. అయితే, పైలట్ల అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఎయిరిండియా AI2651 విమానం, ఇక్కడి విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి సిద్ధమైంది. అయితే, అదే సమయంలో ముందు వెళ్తున్న మరో విమానం కారణంగా గాల్లో తీవ్రమైన అలజడి (Wake Turbulence) ఏర్పడింది. దీంతో విమానం ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి, ల్యాండింగ్ టైమ్‌లో దాని తోక భాగం రన్‌వేను ఢీకొట్టింది.

ఈ కుదుపుతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురైనప్పటికీ, పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిరిండియా యాజమాన్యం ధృవీకరించింది. ప్రమాద తీవ్రతను పరిశీలించేందుకు గానూ ఆ విమానాన్ని ప్రస్తుతానికి గ్రౌండ్ చేసి, సాంకేతిక తనిఖీలకు తరలించారు. ఈ కారణంగా బెంగళూరు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా రిటర్న్ ఫ్లైట్ AI2652 రద్దు అయింది.

Next Story