ఎయిరిండియా ప్రమాదం.. మేడే కాల్ దేనికి సంకేతం? ఫైలట్ ఎందుకు ఆ మేసేజ్ పంపించాడు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-13 07:20:48  IST  )

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత భయానక ఘటనలలో ఒకటిగా నిలిచింది.

ఎయిరిండియా ప్రమాదం.. మేడే కాల్ దేనికి సంకేతం? ఫైలట్ ఎందుకు ఆ మేసేజ్ పంపించాడు!
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత భయానక ఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ విషాద సంఘటనలో దాదాపు 265 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ నుంచి 'మేడే' అనే అత్యవసర సంకేతం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి అందింది. ఈ సంకేతం వినగానే ATC అధికారులు అప్రమత్తమై స్పందనకు సిద్ధమయ్యారు. కానీ, అదే విమానం నుంచి చివరిసారిగా వచ్చిన శబ్దం అయింది. అనంతరం ఏ ఒక్క వాక్యం కూడా ఆ విమానం నుంచి వినిపించలేదు. కొద్ది నిమిషాల్లోనే ఆ విమానం గాలిలోంచి నేలపైకి కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా అసలు మేడే అంటే ఏంటి? అది దేనికి సంకేతం? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మేడే కాల్ అంటే ఏంటి?

విమానాలు లేదా నౌకలు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్ (అత్యవసర సంకేతం). విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది. కంట్రోల్ టవర్ దృష్టికి పరిస్థితి తీవ్రతను తెలియజేయడానికి ఫైలట్ 'మేడే, మేడే, మేడే' అని రిపీటెడ్‌గా చెబుతారు. ఇక ఈ మేడే అనే పదం ఫ్రెంచ్‌ పదం మైడెర్‌ నుంచి వచ్చింది. 'సాయం చేయండి' అని దీని అర్థం. మేడే పదాన్ని మొదటగా లండన్‌లోని క్రోయ్‌డన్‌ విమానాశ్రయంలో సీనియర్‌ రేడియో అధికారి ఫ్రెడ్రిక్‌ స్టాన్లీ మాక్‌ఫర్డ్‌ ఉపయోగించారు. 1920 ఆరంభంలో ‘మేడే’ను విమానయానంలో ప్రమాద సంకేతంగా నిర్ణయించారు. రేడియో కమ్యూనికేషన్లలో దీన్ని సులువుగా గుర్తించే వీలుంటుందని ఈ పదాన్ని ఎంపిక చేశారు.

ఏ పరిస్థితుల్లో ఈ కాల్ పంపుతారు?

విమానాలు లేదా నౌకలు ప్రమాదంలో పడినప్పుడు, పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా తక్షణ చర్య అవసరమైనప్పుడు మేడే సందేశాన్ని పంపుతాయి. పైలట్‌ 'మేడే.. మేడే.. మేడే' అని మూడుసార్లు ఉచ్ఛరించి, అనంతరం తన కాల్‌ సైన్‌, అది ఉన్న ప్రదేశం వంటి వివరాలను చెబుతారు. అది ఏటీసీ, నౌకాయాన నియంత్రణ అధికారులు, సమీపంలోని విమానాలు, నౌకలకు ప్రసారమవుతుంది. విమానం నుంచి మేడే సంకేతం రాగానే ఏటీసీ అధికారులు అత్యవసర ప్రతిస్పందనకు చర్యలు చేపడతారు. అవసరమైన సంస్థలతో సమన్వయం చేసుకుంటారు. సమీపంలోని విమానాలను అప్రమత్తం చేస్తారు. పరిస్థితిని బట్టి అటువైపు వెళ్లవద్దని వాటికి సూచిస్తారు.

Read More..

అహ్మదాబాద్‌లో పెను ప్రమాదం.. నాలుగు ఎయిర్ పోర్టుల్లో హెల్ప్ లైన్స్

Next Story