- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ ఎప్పటికీ లెక్చరర్లతో సమానం కావు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
హాజరు కొరత ఉన్న లా విద్యార్థుల పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యారంగంలో ఏఐ అనేక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పుటికే ఆన్‍లైన్ తరగతుల రూపంలో సంప్రదాయ విద్యకు ఎండ్ కార్డు పడుతున్న తరుణంలో ఏఐ విప్లవం సరికొత్త మార్పులకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్, ఆన్ లైన్ క్లాసులపై మంద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్, ఆన్‌లైన్ క్లాసులు అనేవి ఫిజికల్ క్లాస్‌రూమ్‌లకు, అర్హులైన లెక్చరర్లకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని వ్యాఖ్యానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ మేధస్సుకు దగ్గరగా రావచ్చు కానీ అది విద్యార్థులకు నిజాయితీని, నైతికతను నేర్పించలేదని స్పష్టం చేసింది. క్లాసులకు హాజరు శాతం (Attendance) తక్కువగా ఉందనే కారణంతో పరీక్షలు రాసేందుకు అనుమతించని ముగ్గురు లా విద్యార్థుల పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ కీలక తీర్పును ఇచ్చింది. తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీలును విచారించిన జస్టిస్ ఎస్.ఎమ్. సుబ్రమణ్యం, జస్టిస్ ఎన్. సెంథిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన పాత ఉత్తర్వులను రద్దు చేసింది.
క్రమంగా వచ్చే విద్యార్థులకు అన్యాయం:
హాజరు తక్కువగా ఉన్నందున సెమిస్టర్ పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతో ముగ్గురు న్యాయ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరి పిటిషన్లను పరిశీలించిన ఏకసభ్య ధర్మాసనం వారు తమ కోర్సును కొనసాగించడానికి, 8వ సెమిస్టర్‌కు హాజరు కావడానికి, పరీక్షలు రాయడానికి విద్యార్థులకు అనుమతి ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ విశ్వవిద్యాలయం డివిజన్ బెంచ్‍ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం లా విద్యార్థులకు 70 శాతం హాజరు తప్పనిసరి అని సరైన కారణాలు ఉంటే దాన్ని 65 శాతానికి మాత్రమే సడలించవచ్చు స్పష్టంగా ఉందని పేర్కొంది. హాజరు తక్కువ ఉన్న కొద్దిమంది విద్యార్థులకు మినహాయింపు ఇస్తే క్రమం తప్పకుండా క్లాసులకు హాజరవుతూ నిబంధనలు పాటించే మిగతా విద్యార్థులకు అన్యాయం చేసినట్లవుతుందని ధర్మాసనం పేర్కొంది. న్యాయవాద వృత్తికి నైతిక విలువలు ఎంతో ముఖ్యం. ఇలాంటి పాఠాలు కేవలం తరగతి గదుల్లో అందరి మధ్య కూర్చున్నప్పుడే నేర్చుకోగలరంటూ వ్యాఖ్యానించింది.






