ఏఐ.. సమాజంలో అసమానతలు తగ్గించాలి: ప్రెసిడెంట్ ముర్ము

by Phanindra |

సమాజంలో అసమానతలు తగ్గించేందుకు ఏఐను ఉపయోగించుకోవాలని ప్రెసిడెంట్ ముర్ము సూచించారు.

ఏఐ.. సమాజంలో అసమానతలు తగ్గించాలి: ప్రెసిడెంట్ ముర్ము
X

దిశ, నేషనల్ బ్యూరో: స్కిల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ చేపట్టిన స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ (సోర్) కార్యక్రమంలో స్కిల్‌దినేషన్ ఛాలెంజ్‌ను ప్రెసిడెంట్ డ్రౌపది ముర్ము లాంచ్ చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. అదే సమయంలో ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లో ఐజీఎన్ఓయూ రీజనల్ సెంటర్, స్కిల్ సెంటర్‌ను కూడా ముర్ము వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఏఐ అనేది ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను ప్రపంచ వ్యాప్తంగా మారుస్తోందన్నారు.

‘నేర్చుకోవడం, పని చేయడం, ఆధునిక సేవలు పొందడం, మానవులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాలు.. వీటన్నింటినీ ఏఐ మార్చేస్తోంది. భారత్ వంటి యంగ్ దేశానికి ఏఐ అనేది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం’ అని ముర్ము అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఎప్పుడూ ప్రజలకు లబ్ది చేకూర్చాలని, అందరినీ కలుపుకొని పోయేదిగా ఉండాలని, అందరికీ అవకాశాలు కల్పించేదిగా ఉండాలని, భారత్ అదే కోరుకుంటుందని వెల్లడించారు.

‘ఆర్థిక, సాంకేతిక, సామాజిక విభేదాలను తగ్గించేలా ఏఐ పనిచేయాలి. సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ బెనిఫిట్స్ అందేలా చూడాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఇవి అందడం కీలకం’ అని ముర్ము పేర్కొన్నారు. ఎన్నో అవకాశాలుండే భవిష్యత్తు కోసం విద్యార్థులు సిద్ధమవుతున్నారని, ఇది చాలా సంతోషకరమైన పరిణామమని ఆమె చెప్పారు. అలాగే ఏఐ లెర్నింగ్ మాడ్యూల్స్ నేర్చుకున్న ఎంపీలను ఆమె అభినందించారు.

Next Story