AI Justice: న్యాయశాస్త్రంలో ‘AI’ ప్రకంపనలు: లాయర్ల అవసరం తగ్గుతుందా?

by Kema Shiva Kumar |

న్యాయవాద వృత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సంచలనాత్మక మార్పులు వస్తున్నాయి.

AI Justice: న్యాయశాస్త్రంలో ‘AI’ ప్రకంపనలు: లాయర్ల అవసరం తగ్గుతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సత్తా చాటుతోంది. తాజాగా అత్యంత సంక్లిష్టమైన న్యాయవాద వృత్తిని (Legal Profession) కూడా ఆ టెక్నాలజీ షేక్ చేస్తోంది. ఒకప్పుడు వేల పేజీల డాక్యుమెంట్లు చదవడానికి, గత తీర్పులను పరిశోధించడానికి లాయర్లకు రోజులు పట్టేది. కానీ, ఇప్పుడు ‘AI’ ఆ పనిని కేవలం సెకన్లలోనే పూర్తి చేస్తోంది. దీంతో న్యాయ వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి. సాధారణంగా న్యాయవాద వృత్తిలో రాణించాలంటే దశాబ్దాల అనుభవం, చట్టాలపై అపారమైన పట్టు ఉండాలి. అయితే, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన చాట్ జీపీటీ (ChatGPT), హార్వే ఏఐ (Harvey AI) వంటి టూల్స్ వల్ల సామాన్య న్యాయవాదులు కూడా సీనియర్ల స్థాయిలో చట్టపరమైన పరిశోధన చేయగలుగుతున్నారు. దీంతో వృత్తిపరమైన అడ్డంకులు (Barriers) తగ్గుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జూనియర్ లాయర్ల పని గోవింద..

సాధారణంగా లా ఫామ్స్‌లో జూనియర్ న్యాయవాదులు చేసే ప్రధాన పని.. కేసులకు సంబంధించిన పాత తీర్పులను వెతకడం, డాక్యుమెంట్లను సరిచూడడమే. కానీ, ఇప్పుడు ఆ పనులన్నీ ఏఐ చేస్తుండటంతో జూనియర్ల అవసరం తగ్గుతోంది. దీంతో భవిష్యత్తులో కొత్తగా వృత్తిలోకి వచ్చే వారికి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అభిప్రయాపడుతున్నారు. న్యాయవాదులు సాధారణంగా తాము పని చేసే గంటల ప్రకారం (Billable Hours) క్లయింట్ల నుంచి ఫీజు వసూలు చేస్తారు. రోజుల తరబడి పట్టే పనిని ఏఐ గంటల్లోనే పూర్తి చేస్తుంటే.. క్లయింట్లు ఎక్కువ ఫీజు చెల్లించడానికి సాహసించడం లేదు. ఇది న్యాయ సంస్థల ఆదాయంపై భారీగా ప్రభావం చూపుతోంది.

AI సమాచారం నమ్మదగినదేనా..?

కొన్నిసార్లు ఏఐ లేని కేసులను ఉన్నట్లుగా చూపిస్తుంది. దీంవల్ల కోర్టుల్లో తప్పుడు ఆధారాలు సమర్పించే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదులు ఏఐపై అతిగా ఆధారపడితే వృత్తిపరమైన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇక మరోవైపు, ఏఐ వల్ల సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఖరీదైన లాయర్లను సంప్రదించలేని వారు, ఏఐ సహాయంతో తమ కేసులకు సంబంధించిన ప్రాథమిక చట్టపరమైన సలహాలను సులభంగా పొందతున్నారు. న్యాయవాద వృత్తిని AI పూర్తిగా భర్తీ చేయలేదు కానీ, ఏఐని ఉపయోగించుకోవడం తెలిసిన న్యాయవాదులు మాత్రమే భవిష్యత్తులో పోటీని తట్టుకోగలరు. కేవలం ఇతర కేసుల జడ్జిమెంట్‌లను సేకరించడమే కాకుండా, పక్కా ప్లానింగ్‌తో క్లిష్టమైన కేసుల వాదనల్లో ఏఐ టెక్నాలజీ తోడ్పడనుంది.

Next Story