- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాది మేధస్సును AI భర్తీ చేయలేదు: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్
న్యాయవ్యవస్థలో ఏఐ (AI) పాత్రపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ సృష్టించే తప్పుడు సమాచారంతో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఒక సాధనంగా మాత్రమే ఉండాలని, అది ఎప్పటికీ న్యాయవాది శిక్షణ పొందిన మేధస్సును లేదా న్యాయమూర్తికి ఉండే నైతిక బాధ్యతను భర్తీ చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ (Justice Vikram Nath) స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత కేవలం నోట్స్ తయారు చేయడానికి లేదా సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడవచ్చు కానీ, కొత్త చట్టాలను సృష్టించే అధికారం దానికి ఉండకూడదని జస్టిస్ విక్రమ్ నాథ్ పేర్కొన్నారు. ఏఐ వినియోగం వల్ల సమయం ఆదా అవుతుంది, పని సులభతరం అవుతుందని తెలిపారు. అయితే, న్యాయమూర్తికి ఉండాల్సిన విచక్షణను అది ఎనాటికీ రీప్లేస్ చేయలేదని స్పష్టం చేశారు.
తప్పుడు సమాచారంపై ఆందోళన
ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court)లో కూడా ఏఐ సృష్టించిన తప్పుడు ఉదాహరణలు, లేని చట్టపరమైన ఆధారాలను ప్రస్తావించిన సందర్భాలు రావడంపై జస్టిస్ విక్రమ్ నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి కేవలం సాంకేతిక పొరపాట్లు మాత్రమే కావని, న్యాయ ప్రక్రియ యొక్క విశ్వసనీయతను దెబ్బతీసే అంశాలని ఆయన హెచ్చరించారు.
విజ్ఞతతో కూడిన వినియోగం మస్ట్..
ఏఐ దుర్వినియోగం అవుతుందని మనం సాంకేతికతకు పూర్తిగా దూరం కాకూడదని జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. అదే సమయంలో దానిని గుడ్డిగా ఆమోదించకూడదని.. పరిమితులను అర్థం చేసుకుంటూ, నైతిక క్రమశిక్షణగా వినయోగించాలని సూచించారు. న్యాయ వ్యవస్థ భవిష్యత్తు కేవలం డిజిటలైజేషన్ (Digitalization) మీద మాత్రమే కాకుండా, సంస్థల సమగ్రత, నైతిక విలువలపై ఆధారపడి ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేశారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కూడా ప్రసంగించారు.






