- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ 'కోల్డ్ వార్'.. ప్రధాని మోడీ ముందే ఇద్దరు సీఈవోల వింత ప్రవర్తన! వైరల్
ఢిల్లీ వేదికగా జరుగుతున్నఏఐ సమ్మిట్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజాలందరూ ఒకే వేదికపైకి వచ్చిన ఈ కార్యక్రమంలో, ఇద్దరు ఏఐ కంపెనీల సీఈవోల మధ్య ఉన్న ‘కోల్డ్ వార్’ చర్చనీయాంశమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో జరుగుతున్న ఏఐ సదస్సులో ఓ వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు వేదికపై ఉన్న ఓపెన్ ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మాన్, ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమోడెయ్ ఒకరితో ఒకరు చేతులు కలపడానికి నిరాకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో ప్రధాని మోడీతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచై, మెటా ఏఐ ప్రతినిధులు, ఇతర టెక్ దిగ్గజాలు గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డారు. ఐక్యతకు చాటుతూ అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గాలిలోకి ఎత్తారు. అయితే, ప్రధానికి అటువైపుగా ఉన్న సామ్ ఆల్ట్‌మాన్, డారియో అమోడెయ్ మాత్రం పక్కన పక్కనే ఉన్నవారు చేతులు కలపకుండా కేవలం తమ పిడికిళ్లను మాత్రమే విడిగా పైకి ఎత్తారు.
వైరానికి కారణం ఇదేనా?
ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో, నెటిజన్లు దీనిని ‘ఏఐ కోల్డ్ వార్’ గా అభివర్ణిస్తున్నారు. ‘వారిద్దరూ ఎప్పుడు చేతులు కలుపుతారో, అప్పుడే ఏజీఐ (AGI) సాధ్యమవుతుంది’ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. వాస్తవానికి ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ ఒకప్పుడు ఓపెన్ ఏఐలోనే రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అయితే, ఏఐ భద్రత, సంస్థాగత విధానాల విషయంలో సామ్ ఆల్ట్‌మాన్‌తో విభేదించి 2021లో బయటకు వచ్చారు. తనతో పాటు మరికొందరు సీనియర్లను తీసుకువెళ్లి 'ఆంథ్రోపిక్' అనే పోటీ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థల మధ్య వృత్తిపరమైన పోటీ తీవ్రంగా ఉంది. ఆ పాత విభేదాలే ఇప్పుడు వేదికపై ఇలా బయటపడ్డాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్ ఏఐ శక్తిపై ప్రశంసలు..
వ్యక్తిగత విభేదాలు పక్కన పెడితే, భారత ఏఐ రంగంపై ఇద్దరు సీఈవోలు ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత్‌లో ఉన్న శక్తి, ఆశయం అద్భుతం. రాబోయే కొద్ది ఏళ్లలోనే ఏఐ మానవ మేధస్సును మించిపోతుంది. ఆ విప్లవంలో భారత్ కీలకం కానుంది’ అని డారియో అమోడెయ్ వెల్లడించారు. ‘ఏఐ అడాప్షన్‌లో ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ ముందంజలో ఉంది. ఇది కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఏఐ విప్లవానికి నాయకత్వం వహిస్తున్న దేశం’ అని సామ్ ఆల్ట్‌మాన్ కొనియాడారు. కాగా, ఐదు రోజుల పాటు సాగే ఈ సదస్సులో 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ లీడర్లు పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 20 వరకు ఈ సదస్సు కొనసాగనుంది.






