Agusta Westland: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో క్రిస్టియన్ మైఖేల్‌కు ఊరట.. ఆరేళ్ల తర్వాత బెయిల్ మంజూరు

by B.Srinivas |

రూ. 3,600 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో ఆరేళ్లుగా కస్టడీలో ఉన్న బ్రిటిష్ పౌరుడు క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Agusta Westland: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో క్రిస్టియన్ మైఖేల్‌కు ఊరట.. ఆరేళ్ల తర్వాత బెయిల్ మంజూరు
X

దిశ, నేషనల్ బ్యూరో: రూ. 3,600 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు (Agusta Westland case)లో ఆరేళ్లుగా కస్టడీలో ఉన్న బ్రిటిష్ పౌరుడు క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌ (Christian Michel James) కు సుప్రీంకోర్టు (Supreme court) బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నప్పటికీ జేమ్స్ ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్(Vikram nath), సందీప్ మెహతా(Sandeep mehatha) లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడంతో జేమ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను ఇప్పటికే కేసులో సగం శిక్ష అనుభవించినందున బెయిల్‌పై విడుదల చేయాలని పేర్కొన్నారు. అయితే 2023లో మైఖేల్ బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో గతేడాది ఆయన మళ్లీ దరఖాస్తు చేశారు. ఆ టైంలో సీబీఐ వివరణ కోరిన కోర్టు తాజాగా విచారణ చేపట్టి బెయిల్ ఇచ్చింది.

కాగా, ఈ కేసు హెలికాప్టర్ తయారీ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్ నుంచి 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించినది. వీవీఐపీ హెలికాప్టర్ల సరఫరా కోసం జరిగిన ఒప్పందంలో ప్రభుత్వ ఖజానాకు కోట్లు నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. ఇందులో మైఖేల్‌ రూ.225కోట్లు అందుకున్నారని ఆరోపణలున్నాయి. దీంతో 2016లో సీబీఐ ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసి 2018లో అరెస్ట్ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉండగా తాజాగా బెయిల్ లభించింది.

Next Story