Shashi Tharoor: మీరు రాసిన పుస్తకాన్నే చదువుతున్నా- శశిథరూర్ పై పవన్ ఖేరా వ్యాఖ్యలు

by Shamantha N |

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) సొంతపార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఆయనపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shashi Tharoor: మీరు రాసిన పుస్తకాన్నే చదువుతున్నా- శశిథరూర్ పై పవన్ ఖేరా వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) సొంతపార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఆయనపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ శశిథరూర్‌ రాసిన ద పారాడాక్సియల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకంలోని ఒక పేరాను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. 2016లో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్‌పై థరూర్‌ తన పుస్తకంలో తెలిపిన ఉద్దేశంతో తానూ ఏకీభవిస్తున్నట్లు పోస్టు చేశారు. ‘‘ప్రస్తుతం ఈ పుస్తకాన్ని నేను చదువుతున్నాను. శశిథరూర్‌.. మీరు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా’’ అని పోస్టు చేశారు. అయితే ఆ పుస్తకంలో.. ‘‘2016లో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్‌ను రాజకీయ మైలేజీ కోసం వినియోగించుకున్నారు. మయన్మార్‌లో తిరుగుబాటుదారులను ఎదుర్కోవడంలో భాగంగా జరిగిన సైనిక దాడిని కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ఇలాంటి పని ఎన్నడూ చేయలేదు’’ అని శశిథరూర్‌ విమర్శించారు. దీనికి సంబంధించిన పేరా ఫొటోను పవన్‌ ఖేరా ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు.

వివాదం ఏంటంటే?

కాగా.. పనామా పర్యటనలో ఉన్న థరూర్ ఉగ్రదాడుల గురించి స్పందించారు. థరూర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పార్టీ నేత ఉదిత్ రాజ్ తీవ్రంగా స్పందించారు. "కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బీజేపీకి సూపర్ స్పోక్స్‌పర్సన్. బీజేపీ నేతలు కూడా చెప్పని విధంగా ఆయన మోడీజీకి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసేవో ఆయనకు తెలుసా? భారత సాయుధ బలగాల ఘనతను వీరు (కేంద్ర ప్రభుత్వం) తమ ఖాతాలో వేసుకుంటున్నారు. శశిథరూర్ బీజేపీ ప్రచార విన్యాసాలకు ప్రతినిధిగా మారారు" అని ఉదిత్ రాజ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ విమర్శించారు. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్‌ ఆయనపై మండిపడింది. తాను ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాత్రమే మాట్లాడానని, గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదంటూ శశిథరూర్‌ వివరణ ఇచ్చారు.కాగా.. దీనిపై స్పందించిన పవన్‌ ఖేడా గతంలో థరూర్ చేసిన వ్యాఖ్యలను తన పోస్టు ద్వారా గుర్తు చేశారు.

Next Story