Brahmos: అధునాతన బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి భారత్, రష్యా చర్చలు

by S Gopi |

కొత్తగా అప్‌గ్రేడ్ చేయబోయే బ్రహ్మోస్ క్షిపణి పరిధి 800 కిలోమీటర్లు ఉండనుంది.

Brahmos: అధునాతన బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి భారత్, రష్యా చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి విజయవంతంగా పని చేయడంతో భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు సంబంధించి అధునాతన వెర్షన్‌ తయారీకి చర్చలు ప్రారంభించాయి. భారత్‌లో అప్‌గ్రేడ్ చేసిన క్షిపణి కోసం రష్యా పూర్తిస్థాయిలో సాంకేతిక సహాకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని సమాచారం. కొత్తగా అప్‌గ్రేడ్ చేయబోయే బ్రహ్మోస్ క్షిపణి పరిధి 800 కిలోమీటర్లు ఉండనుంది. తొలి పరీక్ష ఇప్పటికే నిర్వహించినట్టు ఇద్దరు అధికారులు కూడా ధృవీకరించారు. రానున్న నెలల్లో అప్‌గ్రేడ్ చేసిన వేరియంట్ పనితీరుపై అదనపు పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. యూపీలోని లక్నోలో కొత్త బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది స్వదేశీ రక్షణ తయారీలో కీలక మైలురాయిని సాధించింది. రూ. 300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ప్లాంట్ ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఉండగా, ఇందులోనే కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు.

బ్రహ్మోస్.. ప్రపంచంలోనే శక్తిమంతమైన క్రూయిజ్‌ క్షిపణి

యూపీలో 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కొత్త ప్లాంటుకు ఏటా 10 వరకు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను, ఏటా 100-150 తర్వాతి తరం వేరియంట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 'ఆత్మనిర్భర్ భారత్' ద్వారా స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసెందుకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఈ ప్లాంట్ రక్షణ ఉత్పత్తిలో మనదేశ స్వావలంబనను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. బ్రహ్మోస్ ప్రపంచంలోనే శక్తిమంతమైన క్రూయిజ్‌ క్షిపణిగా పిలుస్తారు. దీన్ని యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, భూమి, జలాంతర్గామి నుంచి ఇలా నాలుగు రకాలుగా ప్రయోగించవచ్చు. రాడార్‌కు దొరకకుండా స్టెల్త్‌ టెక్నాలజీతో పని చేసే ఈ క్షిపణి పరిధి 290 కి.మీ.

Next Story