British Fighter Jet: నెలరోజుల తర్వాత సొంత దేశానికి బయలుదేరిన బ్రిటీష్ ఎఫ్-35 ఫైటర్ జెట్

by S Gopi |

అత్యంత అధునాతనమైన, శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన ఈ ఎఫ్-35బీ ఫైటర్ జెట్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది.

British Fighter Jet: నెలరోజుల తర్వాత సొంత దేశానికి బయలుదేరిన బ్రిటీష్ ఎఫ్-35 ఫైటర్ జెట్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నెలకు పైగా నిలిచిపోయిన తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రాయల్ నేవీ ఎఫ్-35బీ ఫైటర్ జెట్ ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన ఈ ఎఫ్-35బీ ఫైటర్ జెట్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. జూన్ 14న అత్యవసర పరిస్థితి కారణంగా తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ జెట్‌లో, ఆ తరువాత కూడా తీవ్రమైన ఇంజనీరింగ్ సమస్యలు తలెత్తాయి. బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న మార్గంలో తక్కువ ఇంధనం, ప్రతికూల వాతావరణం వల్ల అత్యవసరంగా దిగినట్టు మొదట వార్తలు వచ్చాయి. కానీ, బ్రిటన్ అధికారుల ప్రకారం.. ఈ విమానంలో హైడ్రాలిక్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అందుకే జెట్ ముందుకు కదలలేక అక్కడ నిలిచిపోయిందని తెలుస్తోంది. ఈ జెట్ భారత్-యూకే నావికాదళ విన్యాసాల్లో కూడా పాల్గొంది. ఈ కారణంగానే కీలకమైన ఈ విమానం హఠాత్తుగా నిలిచిపోవడం పట్ల అధికారుల్లో ఆందోళన కలిగించింది.

ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించడం స్థానికంగా కుదరకపోవడంతో.. బ్రిటన్ నుంచి 24 మంది ప్రత్యేక నిపుణులతో కూడిన బృందం తిరువనంతపురానికి వచ్చింది. వారంతా నెలరోజులకు పైగా శ్రమించి, మరమ్మతు పనులను పూర్తి చేశారు. ఇందుకోసం భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కూడా సహాయ సహకారాలను అందించింది. దీనికి సంబంధించి మంగళవారం బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. గత నెల అత్యవసర మళ్లింపుతో ల్యాండ్ అయిన యూకే ఎఫ్-35బీ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. యూకే ఇంజనీరింగ్ బృందం మరమ్మతులు, భద్రతా తనిఖీలను పూర్తి చేసింది. విమానం ఇప్పుడు యాక్టివ్ సర్వీస్‌ను తిరిగి పొందింది. ఇందుకు సహకరించిన భారత అధికారులు, విమానాశ్రయ బృందం సహకారానికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

Next Story