కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసిన రిషబ్ శెట్టి.. ఏం చర్చించారంటే..

by Naga Rani Yarlagadda |

ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి కేంద్రహోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసిన రిషబ్ శెట్టి.. ఏం చర్చించారంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: కాంతారా స్టార్ రిషబ్ శెట్టి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ భేటీ తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవంగా నిలిచిపోతుందని పేర్కొంటూ.. ఆ ఫొటోలను రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భేటీలో చర్చించిన కొన్ని విషయాల గురించి వెల్లడించారు. ఈ సమావేశంలో కాంతార సినిమాపై అమిత్ షా ప్రశంసలు కురిపించినట్లు రిషబ్ శెట్టి తెలిపారు. అలాగే త్వరలో రానున్న కాంతార చాప్టర్ -1 గురించీ ప్రశంసిస్తూ మాట్లాడినట్లు వెల్లడించారు. తన కృషిని గుర్తించి అభినందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని రిషబ్ పేర్కొన్నారు.

అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక పలకరింపులకే పరిమితం కాలేదని, భారత చరిత్ర, సంస్కృతి, కళలు, సినీ నిర్మాణం వంటి పలు లోతైన అంశాలపై చర్చ జరిగిందని రిషబ్ వెల్లడించారు. ముఖ్యంగా భారతీయ వారసత్వంపై అమిత్ షాకు ఉన్న లోతైన అవగాహన తనను నిజంగా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. అంతేకాదు.. తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం లభించిందని రిషబ్ శెట్టి తెలిపారు. ప్రస్తుతం తాను ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులపై పని చేస్తున్నానని, త్వరలో వాటి వివరాలు అభిమానులతో పంచుకుంటానని ఈ సందర్భంగా రిషబ్ శెట్టి సంకేతాలిచ్చారు.

Next Story