Abroad: విదేశీ వలసలు సులభతరం.. కొత్త చట్టాన్ని తీసుకురానున్న కేంద్రం!

by vinod kumar |
Abroad: విదేశీ వలసలు సులభతరం.. కొత్త చట్టాన్ని తీసుకురానున్న కేంద్రం!
X

దిశ, నేషనల్ బ్యూరో: విదేశీ ఉపాధి కోసం వెళ్లే వారికి సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ‘ఓవర్సీస్ మొబిలిటీ ఫెసిలిటేషన్ అండ్ వెల్ఫేర్ బిల్లు 2024’ పేరుతో ప్రతిపాదిత చట్టాన్ని తీసుకురానున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ బిల్లుతో 1983 నాటి వలస చట్టాన్ని సవరించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi tharoor) నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ‘సమకాలీన ప్రపంచ వలసల క్రమాన్ని, భారతీయ పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. 1983 వలస చట్టంలోని పలు నిబంధనలను భర్తీ చేయడానికి సమగ్ర సవరణ అవసరం’ అని నివేదికలో పొందుపర్చారు.

కొత్త చట్టానికి సంబంధించిన ముసాయిదా ప్రస్తుతం సంబంధిత మంత్రిత్వ శాఖ వద్ద ఉందని, ప్రజల అభిప్రాయాలు తీసుకునేందుకు త్వరలోనే దీనిని బయటపెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్లులోని కీలక అంశాలపై సంప్రదింపులు జరిపి ఏడాదిలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిపాయి. మారిన ప్రపంచ వలస విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. అంతర్గత సంప్రదింపుల తర్వాత ముసాయిదాను 30 రోజుల పాటు ప్రజా సంప్రదింపుల కోసం ఉంచి ఆ తర్వాత సవరించిన ముసాయిదాపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అంతేగాక భారతదేశం అంతటా ఉన్న అన్ని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కార్యాలయాల పనితీరును ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (PGE) పర్యవేక్షించనుంది.

కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయ వలసదారులను ఇండియాకు పంపించిన విషయం తెలిసిందే. అయితే భారతీయ పౌరులను సైనిక విమానంలో తిరిగి పంపారని, ప్రయాణం జరిగినంత సేపు వలసదారుల చేతులు, కాళ్ళు కట్టేసి తీసుకొచ్చారని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టానికి సంబంధించిన విషయం వెలుగులోకి రావడం గమనార్హం.

Next Story