అర్ధరాత్రి పరాయి వ్యక్తితో భార్య ఫోన్ కాల్స్.. కోర్టు సంచలన తీర్పు

by Prasad Jukanti |   (  Updated:2026-06-25 13:37:21  IST  )

రాత్రి వేళల్లో తన భార్య మరో వ్యక్తకితో మాట్లాడుతోందని వారిద్ధరి కాల్ రికార్డులను భద్రపరచాలంటూ ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అర్ధరాత్రి పరాయి వ్యక్తితో భార్య ఫోన్ కాల్స్.. కోర్టు సంచలన తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక మహిళ అర్థరాత్రి వేళలో ఒక పురుషుడితో ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన ఆమె వ్యక్తిత్వాన్ని శంకించలేమని ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిని సాకుగా చూపిస్తూ ఆమె కాల్ డీటెయిల్స్ రికార్డ్స్ (CDRs) సేకరించాలని కోరడం.. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని స్పష్టం చేసింది. పెండింగ్‍లో ఉన్న గృహహింస కేసులో తన భార్య, మరో వ్యక్తికి సంబంధించిన లేట్ నైట్ కాల్ రికార్డులను భద్రపరచాలంటూ ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ జడ్జి శునాలి గుప్తా గురువారం సంచలన తీర్పును వెలువరించారు.

స్త్రీ, పురుషుడు మాట్లాడుకోవడం నిషేధమేమీ కాదు:

గృహహింస కేసు విచారణలో భాగంగా, తన భార్య అర్ధరాత్రి వేళల్లో ఇతర పురుషులతో ఫోన్‌లో మాట్లాడుతోందని, కాలక్రమేణా ఆ కాల్ డేటాను టెలికాం కంపెనీలు డిలీట్ చేసే అవకాశం ఉన్నందున వాటిని భద్రపరచాలని సదరు భర్త కోర్టును ఆశ్రయించాడు. ట్రయల్ కోర్టు దీనిని తిరస్కరించడంతో అతడు సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జూన్ 2న ఇచ్చిన ఆర్డర్‌లో ‘మన భారతీయ సమాజం ఇప్పుడు ప్రాచీన కాలంలో లేదు. ఒక మహిళ పరాయి పురుషుడితో మాట్లాడటాన్ని ఒక నిషేధంగా భావించే రోజులు పోయాయి. మహిళలు ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలతో సహా అన్ని రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి పురుష సహోద్యోగులు ఉంటారు. కేవలం రాత్రి వేళల్లో ఫోన్ మాట్లాడినంత మాత్రాన.. ఆమెకు ఏదో అక్రమ లేదా వివాహేతర సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేనంత వరకు ఆమె క్యారెక్టర్‌పై ప్రశ్నలు లేవనెత్తలేం’ అని పేర్కొంది.

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించలేం:

న్యాయమైన విచారణ హక్కు కోసం వ్యక్తిగత స్వేచ్ఛకు కొన్నిసార్లు మినహాయింపులు ఉన్నప్పటికీ, ఒకరి వ్యక్తిగత కాల్ రికార్డులను సేకరించాలని కోరినప్పుడు దానికి బలమైన, సహేతుకమైన కారణాలు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. భర్త దాఖలు చేసిన పిటిషన్‌లో భార్యపై ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు, స్పష్టమైన ఆధారాలు చూపించలేదని కేవలం అనుమానంతో కాల్ రికార్డులు అడగటం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని సమర్థిస్తూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను సెషన్స్ కోర్టు పూర్తిగా కొట్టివేసింది.

Next Story