- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణ అయోధ్యకు కొత్త వైభవం.. రూ.351 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం: మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, భద్రాచలం ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ వైభవం, ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
రాబోయే రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని ఈ మేరకు ఈ నెల 27వ తేదీన ఆలయ పునరుద్ధరణ పనులను అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆలయ పునరుద్ధరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.351 కోట్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే శ్రీరామ నవమి నాటికి నిర్దేశించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ముందస్తుగానే పనుల విభజన చేసుకొని అన్ని పనులు చేపట్టాలని సూచించారు.






