Investment: చైనా పెట్టుబడులకు భారత్ గ్రీన్ సిగ్నల్

by S Gopi |   (  Updated:2026-06-25 15:11:02  IST  )

2020 తర్వాత చైనా అనుబంధ సంస్థ నుంచి భారత తయారీ రంగంలోకి వస్తున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలవనుంది.

Investment: చైనా పెట్టుబడులకు భారత్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో చైనా అనుబంధ పెట్టుబడులకు మరో కీలక ద్వారం తెరుచుకోనుంది. చైనా ఆటో దిగ్గజం జీలీ, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన హార్స్ పవర్‌ట్రెయిన్ సంస్థ ప్రతిపాదించిన 370 మిలియన్ డాలర్ల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వనున్నట్లు సమాచారం. 2020 తర్వాత చైనా అనుబంధ సంస్థ నుంచి భారత తయారీ రంగంలోకి వస్తున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలవనుంది. ఈ పెట్టుబడితో రెనాల్ట్ చెన్నై ప్లాంట్‌లో అధునాతన హైబ్రిడ్ ఇంజిన్లు, పవర్‌ట్రెయిన్‌ల తయారీ ప్రారంభం కానుంది. ప్రారంభ దశలో రెనాల్ట్, నిస్సాన్ వాహనాల కోసం హైబ్రిడ్ సాంకేతికతను స్థానికంగా ఉత్పత్తి చేయడంపై కంపెనీ దృష్టి పెడుతుంది. ఈ పెట్టుబడి భారత్ ఆటోమొబైల్ రంగంలో రెండు కీలక సంకేతాలను ఇస్తోంది. ఒకవైపు, స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు చైనా అనుబంధ పెట్టుబడులపై ప్రభుత్వం కొంత సడలింపు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, దేశంలో హైబ్రిడ్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది. ఈ ఏడాది చివర్లో రెనాల్ట్ తన కొత్త డస్టర్ ఎస్‌యూవీని హార్స్ టెక్నాలజీతో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. భవిష్యత్తులో ఇతర ఆటోమొబైల్ కంపెనీలకూ పవర్‌ట్రెయిన్‌ల సరఫరాపై సంస్థ చర్చలు జరుపుతోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆటో మార్కెట్లలో ఒకటైన భారత్‌లో తమ ఉనికిని బలోపేతం చేసేందుకు రెనాల్ట్, నిస్సాన్, జీలీ వంటి సంస్థలు స్థానిక తయారీ, అధునాతన సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

Next Story