'నా కోరిక తీరిస్తేనే పదవి ఇస్తా'.. బీజేపీ జిల్లా అధ్యక్షుడి వేధిస్తున్నాడని మహిళా నాయకురాలు ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-27 09:42:26  IST  )

పదవి అడిగిన పాపానికి తనతో శృంగారంలో పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేధించాడని ఓ మహిళా నాయకురాలు ఆరోపించడం కలకలం రేపుతోంది.

నా కోరిక తీరిస్తేనే పదవి ఇస్తా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడి వేధిస్తున్నాడని మహిళా నాయకురాలు ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీలో పదవి కావాలంటే నాతో శృంగారంలో పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోరాడని ఓ మహిళా నేత చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అంతటితో ఆగకుండా అతడి చెప్పినట్లు చేయాలని పార్టీ నేతల ద్వారా ఒత్తిడి చేయిస్తున్నాడని సదరు మహిళ ఏకంగా ఫేస్ బుక్ లైవ్ ద్వారా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లా బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవ్వడానికి నీ వద్ద చాలా ఉంది:

సదరు మహిళా నాయకురాలు ఫేస్ బుక్ లైవ్ ద్వారా చేసిన ఆరోపణల ప్రకారం మహోబా జిల్లా బీజేపీలో ఇటీవల కొత్త టీమ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తనకు జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని తాను జిల్లా అధ్యక్షుడు మోహన్ లాల్ కుష్వాహా ను అడిగితే కూర్చుని మాట్లాడుకుందామని పిలిపించాడని చెప్పింది. దాంతో తాను అతడి వద్దకు వెళ్లానని చెప్పింది. అక్కడ కుష్వాహా మాట్లాడుతూ నీకు పదవి ఇస్తాను. కానీ నేను నిన్ను జిల్లా ఉపాధ్యక్షురాలిని చేస్తే నాకేమిస్తావ్? అని అడిగాడని పేర్కొంది. దాంతో నేను నా ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు, నా భర్త ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని అందువల్ల ఆర్థికంగా నేనేమి ఇచ్చుకోలేనని చెప్పానన్నారు. దాంతో దీపాలిజీ.. ఇవ్వడానికి మీ వద్ద చాలా ఉందని నాతో ఓసారి గడిపితే జిల్లా ఉపాధ్యాక్షురాలి పదవితో పాటు పంచాయితీలో టికెట్ కూడా ఇస్తానని ఆఫర్ చేసినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. నాతో పాటు లక్నో, ఢిల్లీకి రావాలని అలా చేస్తే మనపై ఎవరికీ అనుమానం రాదంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడారని ఆమె ఆరోపించారు.

ఇతరులతో ఒత్తిడి:

ఈ వ్యవహారంలో పార్టీలోని ఇతర ముఖ్య నాయకులకు కూడా సంబంధం ఉందని దీపాలీ ఆరోపించారు. పంకజ్ తివారీ అనే నేత తనను కలిసి జిల్లా అధ్యక్షుడి మాట వినాలని అలా చేస్తే పార్టీలో మంచి పదవి వస్తుందని ఒత్తిడి చేశాడని ఆమె ఆరోపించింది. అలాగే జైపాల్ అనే మరో నేత రాత్రి వేళల్లో తనకు ఫోన్ చేసి అధ్యక్షుడి ప్రతిపాదనకు అంగీకరించాలని వేధించారని వాళ్లు చెప్పింది చేయకపోతే తన భర్తను నకిలీ అత్యాచార కేసులో ఇరికించి జైలుకు పంపుతామని బెదిరించారని ఆరోపించింది.

మోహన్ లాల్ రియాక్షన్:

ఈ తీవ్ర ఆరోపణలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌లాల్ కుశ్వాహ పూర్తిగా ఖండించారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కుట్ర చేస్తున్నారని, నిష్పక్షపాత విచారణలో నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. పంకజ్ తివారీ కూడా ఈ ఆరోపణలు కల్పితమని కొట్టిపారేశారు.

పోలీసుల దృష్టికి:

ఈ ఆరోపణలపై మహోబా పోలీసులు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో మా దృష్టికి వచ్చిందని ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story