Chilkapalli : స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా కరెంటు లేని గ్రామం

by Muthe.Rajitha |   (  Updated:2025-01-27 16:39:28  IST  )

మనదేశానికి స్వాతంత్ర్యం(Independence) వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కరెంటు(Electricity) వెలుగులకు నోచుకోని గ్రామం ఉందంటే నమ్ముతారా? కానీ అది అక్షరాల నిజం.

Chilkapalli : స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా కరెంటు లేని గ్రామం
X

దిశ, వెబ్ డెస్క్ : మనదేశానికి స్వాతంత్ర్యం(Independence) వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కరెంటు(Electricity) వెలుగులకు నోచుకోని గ్రామం ఉందంటే నమ్ముతారా? కానీ అది అక్షరాల నిజం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నమాటనే గాని వారి ఇళ్ళల్లో వెలుగులు పూసింది మాత్రం 77 ఏండ్ల తర్వాతనే. అంటే ఆ ఊరు పుట్టినప్పటి నుంచి 2025లోనే తొలిసారిగా ఆ గ్రామం కరెంటు వెలుగును చూసింది. ఛత్తీస్‌గఢ్(Chatthisghar) రాష్ట్రంలోని బీజాపూర్(Beejapur) జిల్లా కేంద్రానికి 50 కి.మీ దూరంలోని మారుమూల గ్రామం చిల్కపల్లి(Chilkapalli)లో ఎట్టకేలకు ఇప్పుడు విద్యుత్ పంపిణీ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'నియాద్ నెల్లనార్ యోజన'(Niyad Nellanar Yojana) అనే పథకం కింద ఈ ఊరిలో విద్యుద్దీకరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ స్కీం ద్వారా బీజాపూర్ జిల్లాలో విద్యుద్దీకరణను పూర్తి చేసుకున్న ఆరో గ్రామం చిల్కపల్లి. జనవరి 23 నాటికే ఈ ఊరిలో విద్యుత్ పంపిణీ లైన్ల ఏర్పాటు, ఇంటింటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు పూర్తయ్యాయి. రాబోయే కొన్ని నెలల్లో జిల్లాలోని మరిన్ని మారుమూల గ్రామాల్లోనూ సాధ్యమైనంత విద్యుత్ వెలుగులు రానున్నాయి.

తమ గ్రామానికి కరెంట్ రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ఇప్పటి వరకు మా ఊరు విద్యుత్‌ను చూడలేదు. ఇప్పుడు ఊరిలోని ప్రతీ ఇంట్లో విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి. రాత్రి టైంలో ఇక మా పిల్లలు చదువుకోగలరు. ఇక జీవితాల్లో గొప్ప మార్పు రాబోతుంది" అని చిల్కపల్లికి చెందిన ఓ గిరిజన మహిళ చెప్పుకొచ్చింది. "చాలా దశాబ్దాల తర్వాత మా ఊరిలోకి విద్యుత్ వెలుగులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. భయం లేకుండా రాత్రిపూట ఊరిలో తిరగ గలము" అని మరో గ్రామస్తుడు తెలిపారు. "విద్యుత్ స్తంభాలు, విద్యుత్ పంపిణీ లైన్లను చిల్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం మాకు పెద్ద సవాల్‌గా మారింది. ఎందుకంటే అక్కడికి ప్రయాణం చేయడమే చాలా పెద్ద కష్టం. రోడ్డు సరిగ్గా ఉండదు. ఏది ఏమైనా మేం శ్రమించి 4 నెలల్లోనే ఆ ఊరిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశాం" అని బీజాపూర్ జిల్లాలోని విద్యుత్ విభాగం ఉద్యోగి ఒకరు తెలిపారు.

Next Story