వైద్యరంగంలో AI మరో అద్భుతం.. ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్!

by Prasad Jukanti |   (  Updated:2026-07-06 11:04:37  IST  )

ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా వచ్చే గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించే సరికొత్త ఏఐ సాంకేతికతను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

వైద్యరంగంలో AI మరో అద్భుతం.. ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆకస్మాతుగా సంభవిస్తున్న గుండెపోటు మరణాలు ఆందోళనకరంగా మారాయి. ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే వ్యక్తులు కూడా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా కరోనా పరిస్థితుల తర్వాత ఈ సడెన్ కార్డియాక్ డెత్ (Sudden Cardiac Death) లు పెరిగిపోవడం వైద్య రంగానికి పెద్ద సవాలుగా మారింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఉన్నట్టుండి తమ వారు కాలం చేస్తుంటే ఏమి చేయలేని నిస్సాయస్థితుల్లో అనేక మంది ఉండిపోతున్నారు. ఎలాంటి దురలవాట్లు లేని వారి గుండె సైతం లయతప్పుతుండటంతో ఈ పరిస్థితిపై సర్వత్రా ఆందోళన రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు కృత్రిమ మేధస్సు (AI) అద్భుతమైన పరిష్కార మార్గం చూపించింది. సమస్యను ముందుగానే గుర్తించేలా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. ఏఐ సాయంతో ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించే సరికొత్త గుండె సంకేతాన్ని (Heart Signal) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణ స్క్రీనింగ్ పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో రాబోయే ముప్పును ఈ ఏఐ గుర్తించగలదని పరిశోధకులు చెబుతున్నారు.

దశాబ్ద కాలపు పరిశోధన:

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లే (UC Berkeley) పరిశోధకులు సాధారణంగా చేసే ఈసీజీ (ECG) పరీక్షలో ఇప్పటివరకు వైద్యులకు తెలియని ఓ ప్రత్యేక సంకేతాన్ని ఏఐ ద్వారా గుర్తించారు. ఈ సంకేతం భవిష్యత్తులో ఆకస్మిక గుండె మరణం సంభవించే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయడంలో సహాయపడుతుందని వెల్లడించారు. బెర్క్లీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ జియాద్ ఒబెర్మేయర్ నేతృత్వంలోని బృందం దాదాపు పదేళ్ల పాటు శ్రమించి ఈ పరిశోధన సాగించింది. స్వీడన్‌కు చెందిన 4,40,000 కంటే ఎక్కువ ఈసీజీ (ECG) రేఖాచిత్రాలను, మరణ ధృవీకరణ పత్రాలను (Death Certificates) లింక్ చేసి, వాటిని విశ్లేషించడానికి ఏఐ మోడల్‌కు శిక్షణ ఇచ్చారు. అనంతరం అమెరికా, తైవాన్ దేశాలకు చెందిన రోగుల డేటాతో దీనిని నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సాధారణంగా వైద్యులు గమనించలేని సరికొత్త వేవ్‌ఫార్మ్ ప్యాటర్న్‌ను (Waveform Pattern) ఈ ఏఐ గుర్తించిందని ఇది వైద్య శాస్త్రానికి ఇప్పటివరకు తెలియని ఒక సరికొత్త జీవసంబంధిత క్లూ (Biological Clue) అని పేర్కొన్నారు.

86 శాతం మందికి కొత్తగా గుర్తింపు:

ప్రస్తుతం వైద్యులు గుండె పంపింగ్ సామర్థ్యాన్ని సూచించే LVEF (Left Ventricular Ejection Fraction) ఆధారంగా గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేస్తున్నారు. అయితే సాధారణ LVEF ఉన్నవారిలో కూడా సడన్ కార్డియాక్ డెత్ సంభవిస్తున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం అయింది. అయితే ఏఐ మాత్రం సంప్రదాయ పరీక్షలకు కనిపించని ప్రమాద సంకేతాలను కూడా గుర్తించగలిగిందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుత పద్ధతుల ప్రకారం గుండెపోటు ముప్పు 4.6 శాతంగా ఉంటే, ఈ ఏఐ ద్వారా గుర్తించిన రోగులలో వార్షిక ముప్పు 7 శాతం గా ఉన్నట్లు తేలింది ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలతో పోలిస్తే ఇది 86 శాతం మంది అధిక ప్రమాదంలో ఉన్నవారిని అదనంగా గుర్తించగలిగిందని పరిశోధకులు వెల్లడించారు. సడన్ కార్డియాక్ డెత్‌ను నివారించేందుకు ఇప్పటికే ఇంప్లాంటబుల్ డిఫిబ్రిలేటర్లు (ICD) అందుబాటులో ఉన్నాయి. కానీ అవి ఎవరికి అవసరమో ముందుగా గుర్తించడం కష్టంగా ఉండేది. ఈ విషయంలో ఏఐ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Next Story