మహిళలకు 'విజయ్' వరాల జల్లు.. అధికారంలోకి వస్తే నెలకు రూ.2500, పెళ్లి కానుకలు, మరెన్నో!

by Ramesh Naini |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ హామీల వర్షం కురిపించారు.

మహిళలకు విజయ్ వరాల జల్లు.. అధికారంలోకి వస్తే నెలకు రూ.2500, పెళ్లి కానుకలు, మరెన్నో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ హామీల వర్షం కురిపించారు. మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన తన పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలోని కీలక మహిళా గ్యారెంటీలను ప్రకటించారు. మహిళా సంక్షేమం, రక్షణే ధ్యేయంగా అద్భుతమైన పథకాలను ఆయన వివరించారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ.2,500 నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తాం. అంతేకాకుండా, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం’ అని ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన తల్లులకు అండగా ఉండటానికి, 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లల తల్లులకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

‘అన్న విజయ్ సాయం’తో పెళ్లి కానుక

ఆడబిడ్డల పెళ్లి విషయంలో తల్లిదండ్రులపై భారం తగ్గించేందుకు ‘అన్న విజయ్ సాయం’ అనే పథకాన్ని ఆయన ప్రకటించారు. పెళ్లి చేసుకోబోయే యువతులకు 8 గ్రాముల బంగారంతో పాటు పట్టుచీరను ప్రభుత్వం తరపున ఉచితంగా అందజేయనున్నారు. అలాగే, మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రేషన్ షాపుల ద్వారా ఉచితంగా శానిటరీ ప్యాడ్ల పంపిణీ చేపడతామని తెలిపారు.

రక్షణ కోసం ‘ప్రత్యేక బలగాలు’

మహిళల భద్రత విషయంలో విజయ్ అత్యున్నత ప్రాధాన్యతనిచ్చారు. మహిళలపై నేరాలను అరికట్టడానికి బాడీ కెమెరాలతో కూడిన ‘రాణి వేలు నాచాయర్ ఫోర్సెస్’ పేరుతో 500 ప్రత్యేక బలగాలను రంగంలోకి దించుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా చీకటి ప్రాంతాలు లేకుండా పటిష్టమైన లైటింగ్, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో స్మార్ట్ పానిక్ బటన్లను ఏర్పాటు చేసి, కేవలం 5 నిమిషాల్లోనే పోలీసులు స్పందించేలా 24 గంటల కమాండ్ సెంటర్‌కు అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు.

ఉచిత బస్సు ప్రయాణం కొన్ని బస్సులకే..

ప్రస్తుతం తమిళనాడులో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై విజయ్ విమర్శలు గుప్పించారు. కొన్ని బస్సులకే పరిమితం చేయడం వల్ల మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, టీవీకే అధికారంలోకి వస్తే అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.

Next Story