బాయ్‌ఫ్రెండ్ కోసం కన్న కొడుకు బలి.. కేరళంలో ఒళ్ళు గగుర్పొడిచే ఘోరం

by Ramesh Naini |

కేరళంలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన ఒక హృదయవిదారక ఘటన వెలుగుచూసింది.

బాయ్‌ఫ్రెండ్ కోసం కన్న కొడుకు బలి.. కేరళంలో ఒళ్ళు గగుర్పొడిచే ఘోరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళంలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన ఒక హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఓ కన్నతల్లే ఏడాదిన్నర కుమారుడిపై జరుగుతున్న నరకయాతనను చూస్తూ ఉండిపోయింది. ప్రియుడి క్రూరత్వానికి తోడైన తల్లి నిర్లక్ష్యం కారణంగా మాటలు కూడా రాని ఆ పసిప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. ఈ దారుణానికి ఒడిగట్టిన తల్లి అఖిల, ఆమె ప్రియుడు అష్కర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ దర్యాప్తు వివరాల ప్రకారం.. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో అఖిల అనే మహిళ అష్కర్ అనే వ్యక్తితో కలిసి నెడుమంగాడ్ సమీపంలోని పనవూర్‌లో సహజీవనం చేస్తోంది. అయితే, అఖిల ఏడాదిన్నర కుమారుడు అర్షిద్ ఏడుస్తున్నాడనే కోపంతో అష్కర్ ఆ చిన్నారిని క్రూరంగా వేధించడం ప్రారంభించాడు. ఏడాది కాలంగా సిగరెట్లతో కాల్చడం, ఎముకలు విరిగేలా కొట్టడం చేస్తూ వచ్చాడు. కన్న కొడుకు అంతలా చిత్రహింసలు అనుభవిస్తున్నా తల్లి అడ్డుకోకపోగా, ఉల్టా ప్రియుడికే సహకరించింది. చివరికి గత శుక్రవారం తీవ్రమైన దెబ్బల కారణంగా చిన్నారి ఆస్పత్రిలో కన్నుమూశాడు.

పోస్ట్‌మార్టం నివేదికలో షాకింగ్ నిజాలు..

చిన్నారి శరీరంపై పాతవి, కొత్తవి కలిపి మొత్తం 51 గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. బాబు కాళ్ల అడుగు భాగంలో కాలిన గాయాలు ఉన్నాయి. చేతులు విరిగేలా తొక్కేసారు. అన్నం తిన్న తర్వాత అష్కర్ విచక్షణారహితంగా కొట్టడం వల్లే బాబుకు వాంతులు, దగ్గు వచ్చి ఊపిరాడక చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. బాబు చనిపోయిన తర్వాత ఇంట్లోని రక్తపు మరకలను కడిగేసి, బాబు బట్టలను, కొన్ని పత్రాలను పెరట్లో తగలబెట్టి ఆధారాలు మాయం చేయాలని నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులపై తిరగబడ్డ స్థానికులు

పోలీసులు శనివారం అష్కర్‌ను అరెస్ట్ చేసి, మే 31 (ఆదివారం) ఆధారాల సేకరణ కోసం ఘటనా స్థలానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు పోలీసుల బందోబస్తును సైతం లెక్కచేయకుండా అష్కర్‌పై తిరగబడి దేహశుద్ధి చేశారు. నిందితుడి కారును కూడా ధ్వంసం చేశారు. గతంలో అష్కర్ తన మొదటి భార్యను కూడా వరకట్నం కోసం వేధించి, ఏడాది పాటు కోమాలోకి పంపిన నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కఠిన శిక్ష తప్పదు: మంత్రి బిందు కృష్ణ

ఈ ఘోరమైన ఘటనపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా చేసిన ఈ కేసులో నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా పకడ్బందీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు తెస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Next Story