అరుదైన గిఫ్ట్! అల్లుడికి ఏకంగా కిలోన్నర వెండితో చెప్పులు.. నెట్టింట వైరల్

by Ramesh Naini |

బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో.. సామాన్యులు చిన్న ఆభరణం కొనాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.

అరుదైన గిఫ్ట్! అల్లుడికి ఏకంగా కిలోన్నర వెండితో చెప్పులు.. నెట్టింట వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో.. సామాన్యులు చిన్న ఆభరణం కొనాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ఓ సంపన్న కుటుంబం మాత్రం తమ అల్లుడిపై ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఏకంగా ‘వెండి చెప్పుల’ను బహుమతిగా ఇచ్చారు. కిలోన్నర వెండితో తయారు చేసిన ఈ కొల్హాపూరి చెప్పుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో ‘ధోండ్య’ మాసంలో అల్లుళ్లకు ప్రత్యేక మర్యాదలు చేయడం, వారికి నగలు, వస్తువులు లేదా బట్టలు బహుమతిగా ఇవ్వడం ఒక పాత సంప్రదాయం. ఈ ఆనవాయితీని పురస్కరించుకుని సాంగ్లీ జిల్లాకు చెందిన ఓ మామగారు తన అల్లుడికి మునుపెన్నడూ చూడని విధంగా ఓ అరుదైన కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కొల్హాపూర్‌లోని నిపుణులైన హస్తకళాకారులను సంప్రదించి, సాంప్రదాయ ‘కొల్హాపూరి’ శైలిలో వెండి చెప్పులకు ఆర్డర్ ఇచ్చారు.

తయారీకి 8 రోజులు.. ఖర్చు రూ.4 లక్షలు!

ఈ ప్రత్యేకమైన పాదరక్షల తయారీకి సుమారు కిలోన్నర (1.5 కిలోలు) కంటే ఎక్కువ వెండిని వినియోగించినట్లు సమాచారం. వీటి మొత్తం ఖర్చు అక్షరాలా రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా. కొల్హాపూర్‌కు చెందిన ఓ కళాకారుడు ఎనిమిది రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి వీటిని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ పనితనానికి గానూ అతనికి రూ.22,000 పారితోషికంగా చెల్లించారు. పైకి చూస్తే అవి వెండితో చేసినట్లు కూడా అనిపించనంత సూక్ష్మంగా, అద్భుతమైన పనితనంతో ఈ చెప్పులను రూపొందించడం విశేషం.

నెటిజన్ల భిన్న స్పందనలు..

ప్రస్తుతం ఈ కిలోన్నర వెండి కొల్హాపూరి చెప్పుల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆ కళాకారుడి నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ, అల్లుడి అదృష్టాన్ని పొగుడుతుండగా.. మరి కొందరు నెటిజన్లు మాత్రం ఈ దుబారా ఖర్చుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఓ వైపు పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని మోడీ లాంటి వారు సూచిస్తుంటే.. ఇలా కేవలం కాలికి వేసుకునే చెప్పుల కోసం లక్షల రూపాయల వెండిని వృధా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విమర్శలు ఎలా ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ‘వెండి చెప్పుల’ ముచ్చటే మార్మోగుతోంది. లింక్..

Next Story