రక్షణ రంగంలో సరికొత్త మైలురాయి.. ‘రుద్రం-II’ క్షిపణి పరీక్షలు విజయవంతం

by Kema Shiva Kumar |

భారత్‌ రక్షణ రంగంలో మరో మైలురాయి చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 'రుద్రం-II' (Rudram-II) క్షిపణి పరీక్షలను డీఆర్‌డీవో (DRDO) సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది.

రక్షణ రంగంలో సరికొత్త మైలురాయి.. ‘రుద్రం-II’ క్షిపణి పరీక్షలు విజయవంతం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పక్కా స్వేదేశీ టెక్నాలజీతో రూపొందించిన ‘రుద్రం-II’ (Rudram-II) క్షిపణి ప్రయోగ పరీక్షలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్‌లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) చండీపూర్ వేదికగా జరిగిన ఈ పరీక్షల్లో క్షిపణి తన ప్రతాపాన్ని చాటింది. అయితే, యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన తర్వాత, ఈ క్షిపణి అత్యంత పిన్-పాయింట్ ఖచ్చితత్వంతో ముందే నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని రకాల పరీక్షా లక్ష్యాలు పూర్తిగా నెరవేరాయని అధికారులు వెల్లడించారు. చండీపూర్ ఐటీఆర్ (ITR) పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ రకాల అత్యాధునిక రేంజ్ పరికరాలు, కెమెరాల ద్వారా సేకరించిన ఫ్లైట్ డేటా ఆధారంగా ఈ విజయాన్ని నిర్ధారించారు.

హైదరాబాద్ ల్యాబ్ ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ ఘనత

ఈ అత్యాధునిక ‘రుద్రం-II’ క్షిపణిని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో నోడల్ లాబొరేటరీ అయిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టులో డీఆర్‌డీవోకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (HEMRL), ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE) ల్యాబ్‌లు కలిసి పనిచేశాయి. వీటితో పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఇతర రక్షణ రంగ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలు (DcPPs) ఈ క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. అలాగే రుద్రం-II క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన డీఆర్‌డీవో (DRDO), భారత వాయుసేన (IAF), రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు (DPSUs) మరియు పారిశ్రామిక భాగస్వాములను ఆయన అభినందించారు.

Next Story