భారత్ రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర.. ‘అగ్ని’ క్షిపణి ప్రయోగం సక్సెస్

by Gantepaka Srikanth |

భారత రక్షణ రంగం మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా, ఒకే క్షిపణితో వేర్వేరు ప్రాంతాల్లోని బహుళ లక్ష్యాలను ఒకేసారి ఛేదించగల అత్యాధునిక 'అగ్ని' క్షిపణిని భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది.

భారత్ రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర.. ‘అగ్ని’ క్షిపణి ప్రయోగం సక్సెస్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ రంగం మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా, ఒకే క్షిపణితో వేర్వేరు ప్రాంతాల్లోని బహుళ లక్ష్యాలను ఒకేసారి ఛేదించగల అత్యాధునిక 'అగ్ని' క్షిపణిని భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) సాంకేతికతతో కూడిన ఈ సుదీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగం దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పతాక స్థాయికి చేర్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారా ప్రయోగించిన క్షిపణి, హిందూ మహాసముద్ర ప్రాంతంలోని వేర్వేరు భౌగోళిక ప్రాంతాల్లో ఉన్న పలు లక్ష్యాలను ఖచ్చితత్వంతో తాకినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భూమిపై, నౌకల్లో ఉన్న టెలిమెట్రీ, ట్రాకింగ్ స్టేషన్ల ద్వారా ఈ క్షిపణి ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పర్యవేక్షించారు.

MIRV సాంకేతికత ప్రత్యేకత..

సాధారణ క్షిపణులు ఒకే వార్‌హెడ్‌ను మోసుకెళ్లి ఒకే లక్ష్యాన్ని తాకుతాయి. కానీ, ఈ సరికొత్త MIRV సాంకేతికత వల్ల ఒకే క్షిపణిలో అనేక వార్‌హెడ్‌లను అమర్చవచ్చు. ఇవి అంతరిక్షం నుండి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు విడిపోయి, వేర్వేరు దిశల్లో ఉన్న శత్రువుల స్థావరాలను ఒకేసారి ధ్వంసం చేస్తాయి. ఈ రకమైన సాంకేతికత ప్రస్తుతం ప్రపంచంలోని అతికొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించింది. ఈ విజయవంతమైన ప్రయోగంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భారత సైన్యం మరియు రక్షణ పరిశ్రమలకు ఆయన అభినందనలు తెలిపారు. మారుతున్న ప్రాంతీయ భద్రతా సవాళ్ల దృష్ట్యా, ఈ క్షిపణి భారత్ యొక్క అణ్వాయుధ నిరోధక శక్తిని (Nuclear Deterrence) మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ తన రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా మరో భారీ అడుగు వేసినట్లయింది.

Next Story