పవన విద్యుత్ రంగంలో నయా శకం.. దేశంలో తొలి ‘విండ్ సప్లై చైన్ పోర్టల్’ ప్రారంభం

by Ramesh Naini |   (  Updated:2026-06-15 16:05:53  IST  )

దేశంలో పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌ను ప్రారంభించింది.

పవన విద్యుత్ రంగంలో నయా శకం.. దేశంలో తొలి ‘విండ్ సప్లై చైన్ పోర్టల్’ ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ (WT-MARUT) పోర్టల్‌ను ప్రారంభించింది. గోవాలో నిర్వహించిన గ్లోబల్ విండ్ డే-2026 జాతీయ సదస్సులో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఫ్రమ్ అంబిషన్ టు యాక్సిలరేషన్’ అనే థీమ్‌తో జరిగిన సదస్సులో 2030 నాటికి 100 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్య సాధనకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, Indian Wind Turbine Manufacturers Association సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు దేశీయ తయారీదారులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

ఈ సందర్భంగా మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రికార్డు స్థాయిలో 6.1 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం జతకాగా, మొత్తం స్థాపిత సామర్థ్యం 56.1 గిగావాట్లకు చేరిందన్నారు. దీంతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్‌గా భారత్ తన స్థానాన్ని మరింత బలపరుచుకుందని తెలిపారు. అలాగే పవన టర్బైన్లు, అనుబంధ పరికరాల ఎగుమతులు రూ.12 వేల కోట్లకు మించి నమోదయ్యాయని వెల్లడించారు.

Next Story