- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. 59 ఏళ్ల తర్వాత కేబినెట్‍లోకి కాంగ్రెస్
తమిళనాడులో కేబినెట్ విస్తరణ జరిగింది. కొత్తగా 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం ఇవాళ మంత్రివర్గాన్ని విస్తరించింది. తాజా విస్తరణలో భాగంగా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‍భవన్‍లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. వీరిలో టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఐయూఎంఎల్ (IUML), వీసీకే (VCK) పార్టీలు ఈ విడత క్యాబినెట్ విస్తరణలో భాగం కాలేదు.
59 ఏళ్ల తర్వాత కేబినెట్ లోకి కాంగ్రెస్:
అయితే ఇవాళ జరిగిన కేబినెట్ విస్తరణ తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. 59 ఏళ్ల తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కెబినెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో చివరిసారిగా కాంగ్రెస్ తరఫున ఎం.భక్తవత్సలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1967లో జరిగిన చారిత్రాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో సి.ఎన్. అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే (DMK) చేతిలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ పార్టీ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకేకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అప్పటి వరకు డీఎంకేతో ఉన్న బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, తిరు పి.విశ్వనాథన్ మంత్రులుగా చేరడం ద్వారా ఆరు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది.
బలమైన క్యాబినెట్‌గా విజయ్ సర్కార్:
మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అదే రోజు తొమ్మది మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిబంధనల ప్రకారం అసెంబ్లీ మొత్తం స్థానాల్లో 15 శాతానికి మించకుండా.. గరిష్టంగా 35 మందిని క్యాబినెట్‌లోకి తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చేరబోయే 23 మందితో కలిపి విజయ్ క్యాబినెట్‌లో మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరుకుంటుంది. మిగిలిన 3 స్థానాలను భవిష్యత్తులో వీసీకే, ఐయూఎంఎల్ వంటి మిత్రపక్షాల కోసం కేటాయించే అవకాశం ఉంటుంది.






