ఆన్‍లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తండ్రి, అక్కను దారుణంగా చంపిన మైనర్ బాలుడు!

by Prasad Jukanti |   (  Updated:2026-06-08 06:46:06  IST  )

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తల్లిదండ్రులు, అక్కపై కత్తితో దాడి చేసిన మైనర్ బాలుడు ఆ తర్వాత తనపై తాను దాడి చేసుకున్నాడు.

ఆన్‍లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తండ్రి, అక్కను దారుణంగా చంపిన మైనర్ బాలుడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పిన పాపానికి కన్న తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన అక్కపై కత్తితో దాడి చేశాడో మైనర్ బాలుడు. అనంతరం తానూ గొంతుకోసుకుని దారుణానికి పాల్పడ్డాడు. అందరిని షాక్ కు గురి చేసిన ఈ ఘటన కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతిలో చోటు చేసుకుంది. ఈఘటనలో తండ్రి వెంట్ నాయుడు, సోదరి ప్రగతి మరణించగా తీవ్ర గాయాలతో తల్లి, మైనర్ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జాతీయ మీడియాలో కథనాల ప్రకారం ఓ ప్రైవేట్ పాఠశాలలో వంటమనిషిగా పని చేస్తున్న వెంకట్ నాయడు (45), సౌజన్య దంపతులకు ఒక కుమార్తె ప్రగతి (20), సాయి వెంట్ మణిదీప్ (16) పిల్లలు ఉన్నారు.

అందరు పడుకున్నాక దారుణం:

వెంకట్ నాయుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలతో పాటు వెంకట్ నాయుడు తల్లిదండ్రులు రాత్రి పడుకునే ముందు కలిసి భోజనం చేసి ఇంట్లోనే వేరువేరు గదుల్లో నిద్రపోయారు. రాత్రి సుమారు 10.30 గంటలకు ఇంట్లో అరుపులు కేకలు వినిపిచడంతో వెంకట్ నాయుడు తండ్రి తాతారావు నిద్రలేచి చూసేసరికి లోపని నుంచి గది తలుపు వేసి ఉంది. దీంతో తలుపు తెరవలేక అతడు ఇరుగుపొరుగు వారిని పిలిచారు. అక్కడ కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వారు నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కత్తిపోట్ల కారణంగా అక్క ప్రగతి ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. తీవ్రంగా గాయపడిన తండ్రి యంకన్న నాయుడును బళ్లారిలోని విమ్స్ (VIMS) ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి సౌజన్య ప్రస్తుతం బళ్లారి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘర్షణలో సదరు మైనర్ బాలుడికి కూడా గాయాలు కావడంతో అతనికి కూడా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనమే కారణమా?

బాలుడి తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగావతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. అయితే ఈ దారుణానికి గల అసలు కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే, సదరు బాలుడు ఆన్‌లైన్ గేమింగ్‌కు (Online Gaming) తీవ్రంగా బానిసయ్యాడని, ఆ విషయంలో జరిగిన గొడవే ఈ దాడికి కారణం కావచ్చని అనుమానిస్తున్నామని ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదని పోలీసులు తెలిపారు.

Next Story