తప్పిన పెను ప్రమాదం.. విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్‌

by Yella Dhawani Reddy |

అహ్మాదాబాద్ ఘోర విమాన ప్రమాదం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మందికి పైగా మరణించారు.

తప్పిన పెను ప్రమాదం.. విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్‌
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మాదాబాద్ ఘోర విమాన ప్రమాదం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మందికి పైగా మరణించారు. అయితే, ఈ ప్రమాదం తర్వాత విమానయాన రంగం భద్రతా ప్రమాణాలపై పెద్ద దుమారం కొనసాగుతోంది. ఎందుకంటే.. ఈ ఘటన మరవకముందే పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతూ ఉండటం, ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. విమానాల రద్దు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు, సాంకేతిక లోపాలు.. ఇవన్నీ ఇటీవల రోజు నిత్యకృత్యాలుగా మారిపోతున్నాయి. తాజాగా మరో ప్రమాదకర ఘటన వెలుగుచూసింది.

పుణె నుంచి గోవా వెళ్తున్న (Pune to Goa) స్పైస్‌జెట్ (Spicejet) విమానంలో గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది. విమానంలోని ఒక కిటికీకి సంబంధించిన లోపలి ఫ్రేమ్‌ ఊడిపోవడంలో ప్రయాణికులు ఒక్కసారిగా కలవరపడ్డారు. అయితే, ఇది కేవలం కాస్మెటిక్‌ ఫ్రేమ్‌ మాత్రమేనని, ప్రయాణికుల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పైస్‌జెట్ స్పష్టంగా పేర్కొంది.

స్పైస్‌జెట్ ప్రకటన ప్రకారం, ఇది క్యూ400 మోడల్‌కి చెందిన విమానం కాగా, ఇందులో బలమైన బహుళ పొరల కిటికీలు ఉండేలా ప్రత్యేకంగా నిర్మించబడింది. గాల్లో ఉన్నప్పుడు కూడా కేబిన్‌ పీడనం సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించారు. విమానం పుణెలో దిగిన తర్వాత, ఫ్రేమ్‌ను ప్రామాణిక నిర్వహణ ప్రక్రియల ద్వారా తిరిగి బిగించారు.

ఇక ఈ ఘటనపై ఓ ప్రయాణికుడు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ విమాన యోగ్యతను ప్రశ్నించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనతో మరోసారి విమానాల్లో భద్రతా ప్రమాణాలపై చర్చ తెరపైకి వచ్చింది. అయితే స్పైస్‌జెట్ స్పష్టంగా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని, తాము అన్ని భద్రతా నియమాలను పాటిస్తున్నామని చెబుతోంది.

Next Story