పోలీస్ స్టేషన్‌లో తండ్రీకొడుకుకు చిత్రహింసలు.. మదురై కోర్టు సంచలన తీర్పు

by Vemula.Srinu Prasad |

పోలీస్ స్టేషన్‌లో తండ్రీకొడుకును చిత్రహింసలకు గురి చేసి వారి చావుకు కారణమైన కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిది మంది పోలీస్ ఆఫీసర్లను దోషులుగా తేల్చింది. ..

పోలీస్ స్టేషన్‌లో తండ్రీకొడుకుకు చిత్రహింసలు.. మదురై కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: పోలీస్ స్టేషన్‌లో తండ్రీకొడుకును చిత్రహింసలకు గురి చేసి వారి చావుకు కారణమైన కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిది మంది పోలీస్ ఆఫీసర్లను దోషులుగా తేల్చింది. ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనుంది. ఈ సంచలన ఘటన జూన్ 2020లో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని శాతంకుళంలో జరిగింది. కోవిడ్ సమయంలో లాక్‌డౌన్ కర్ఫ్యూ వేళ షాపు మూసివేయలేదనే కారణంతో మొబైల్ ఫోన్ షాప్ నడుపుకునే పి. జయరాం (58), అతని కుమారుడు జె. బెన్నిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రంతా లాకప్‌లో చిత్రహింసలకు గురి చేశారు. అయితే వారిని కొట్టిన దెబ్బలకు స్టేషన్ గోడల మీద రక్తపు మరకలు అయ్యాయి. ఆ మరునాడు ఉదయం లేవలేని స్థితిలో, రక్తమోడుతున్నా తండ్రీ కొడుకులిద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రిమాండ్ కోసం ఆరోగ్యంగా ఉన్నారనే మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈ మేరకు వారిద్దరినీ కోవిల్‌ పట్టి జైలుకు తరలించారు. అయితే ఆ మరునాడే తండ్రి చనిపోయారు. ఒక రోజు తర్వాత కొడుకూ మృతి చెందారు.

తమిళనాడులో సంచలనం

దీంతో ఈ కేసు తమిళనాడులో సంచలనం సృష్టించింది. పౌరసమాజం ప్రతినిధులు, మీడియా, రాజకీయ నాయకులు ఈ లాకప్‌డెత్ కారకులపై నమోదు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. తొలుత మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ ఈ కేసును తనంతట తానే విచారణకు స్వీకరించింది. తదనంతరం కేసును సీబీఐకి అప్పగించారు. కేసు నమోదు చేసి సాక్షులను విచారించిన సీబీఐ పలు సాక్ష్యాలను సేకరించింది. సిసి టివీ ఫుటేజ్ పరిశీలించిన సిబీఐ అధికారులు అసలు ఆ తండ్రీ కొడుకులు కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు కూడా ఉల్లంఘించలేదని, పోలీసులు తప్పుడు కేసు పెట్టారనే విషయం గుర్తించారు తండ్రీ కొడుకులను లాకప్‌లో చిత్రహింసలు పెట్టడానికి వాడిన లాఠీలు, వారి వంటి మీద రక్తం తుడవడానికి వాడిన వస్త్రం మీద ఉన్న డీఎన్ఏ సరిపోల్చారు. బాధితుల ఒంటిపై గాయాలు కూడా చిత్రహింసకు లోనైనట్టు ఉన్నాయి. ముఖ్యంగా అదేరోజు పోలీస్ స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ ఈ దారుణాన్ని చూసి కలత చెంది తన సహచర పోలీసులు ఎట్లా ఆ ఇద్దరు అమాయకులను రాత్రంతా బట్టలూడదీసి చిత్రహింసలు పెట్టారో సాక్ష్యం చెప్పింది. మొత్తం పది మంది పోలీసులు ఈ కేసులో నిందితులు కాగా, ఒక పోలీస్ విచారణ జరుగుతుండగానే కోవిడ్‌తో మరణించారు. దీంతో తాజాగా విచారణ చేపట్టిన మధురై కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.

Next Story