ప్రియురాలి ఇంట్లో ఇనుప పెట్టె టెన్షన్.. ఊపిరాడక అల్లాడిన ప్రేమికుడు.. ఏమైందంటే?

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఒక విచిత్ర సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రియురాలి ఇంట్లో ఇనుప పెట్టె టెన్షన్.. ఊపిరాడక అల్లాడిన ప్రేమికుడు.. ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (UttarPradesh) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఒక విచిత్ర సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లవర్‌‌ను కలవడానికి వెళ్లిన ఓ యువకుడు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తన ప్రియురాలి ఇంట్లో దాదాపు 45 నిమిషాల పాటు ఊపిరాడని స్థితిలో ఇనుప పెట్టెలో బందీ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన ఒక యువకుడు, తన ఇంటికి కేవలం ఏడు ఇళ్ల దూరంలో ఉండే తన ప్రియురాలిని కలవడానికి శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. అయితే, పక్కనే నివసించే ఆమె అత్తకు ఆ ఇంట్లో ఏదో అలజడి వినిపించి అనుమానం వచ్చింది. ఆమె వెంటనే అక్కడికి చేరుకుని తలుపు తట్టింది. ప్రియుడు దొరికిపోతాడనే భయంతో ఆ యువతి అతడిని వెంటనే గదిలో ఉన్న ఒక పెద్ద ఇనుప ట్రంకు పెట్టెలో దాచి, బయట నుంచి తాళం వేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు తలుపు తీసింది.

45 నిమిషాల ఉత్కంఠ..

యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అత్త, వెంటనే యువతి తల్లికి, సోదరుడికి సమాచారం అందించింది. వారు వచ్చి ఇల్లంతా గాలించారు. మంచాల కింద, బీరువాల్లో, డాబా పైన వెతికినా ఎవరూ కనిపించలేదు. దాదాపు 45 నిమిషాల తర్వాత, ఆ ఇనుప పెట్టెలో నుంచి వింత శబ్దాలు రావడం మొదలైంది. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ఆ యువకుడు బయటకు రావడానికి పెట్టెను లోపలి నుంచి తట్టాడు. పెట్టె తాళం ఇవ్వమని కుటుంబ సభ్యులు కోరగా, అందులో తన బట్టలు ఉన్నాయని యువతి నిరాకరించింది. మరోవైపు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల ఎంట్రీ.. నవ్వుల పువ్వులు

పోలీసులు అక్కడికి చేరుకుని గట్టిగా అడగడంతో ఆ యువతి వణుకుతున్న చేతులతో తాళం తీసింది. పెట్టె తెరవగానే చెమటతో తడిసిపోయి, ఊపిరి అందక అల్లాడుతున్న యువకుడు బయటపడ్డాడు. ఆ దృశ్యాన్ని చూసి అక్కడున్న పోలీసులు సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. అయితే, యువతి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. యువకుడిని కొట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ‘వీళ్లిద్దరినీ జైల్లో పెట్టండి’ అంటూ యువతి తల్లి పోలీసులను కోరింది.

Next Story