- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశానికి భారీ షాక్ తప్పదు.. ముందే సిద్ధమవ్వండి: ఉదయ్ కొటక్ సంచలన హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో చెలరేగుతున్న యుద్ధం కారణంగా భారతదేశానికి త్వరలోనే భారీ ‘ఆర్థిక షాక్’ తగలనుందని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ సంచలన హెచ్చరికలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో (Middle East) చెలరేగుతున్న యుద్ధం కారణంగా భారతదేశానికి త్వరలోనే భారీ ‘ఆర్థిక షాక్’ తగలనుందని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ సంచలన హెచ్చరికలు చేశారు. రాబోయే గడ్డు పరిస్థతికి దేశం, ప్రజలు ముందుగానే సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ (CII) వార్షిక సదస్సులో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఊహించని దానికంటే తీవ్రంగా ముప్పు!
గత రెండు నెలలుగా మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇంకా పూర్తిగా భారత్‌పై పడలేదని, కానీ రాబోయే రోజుల్లో ఆ ప్రభావం వస్తుందని, అది కూడా భారీ స్థాయిలో ఉండబోతోందని కొటక్ హెచ్చరించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల భారం సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందరినీ కుదిపేయనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మిడిల్ ఈస్ట్ సమస్య మనం అనుకుంటున్న దానికంటే చాలా పెద్దది, అత్యంత సంక్లిష్టమైనది. ఆర్థిక షాక్ రాబోతోంది. రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఆ విపత్కర పరిస్థితులు రాకముందే మనం మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఆ కష్టకాలం రాకూడదని కోరుకుందాం.. కానీ వస్తే ఎదుర్కోవడానికి మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితులకైనా సన్నద్ధమై ఉండాలి’ అని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోడీకి మద్దతు.. స్థోమతకు మించి ఖర్చులొద్దు
అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఉదయ్ కొటక్ సమర్థించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతోనే ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని వివరించారు. దేశ బ్యాలెన్స్ షీట్, లాభనష్టాల ఖాతాను దృష్టిలో ఉంచుకుని అనవసర వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు పూర్తిగా మారిపోయాయని ఆయన విశ్లేషించారు. గతంలో ఉన్న పరస్పర సహకార వాతావరణం పోయి, ప్రతి దేశం తమ స్వార్థం తాము చూసుకునే (రక్షణవాదం) పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుత ప్రపంచం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.






