ఉల్క ఢీకొట్టడంతో ఏర్పడిన భారీ క్రేటర్‌.. భూమిపై జీవరాశుల ఆవిర్భానికి సంబంధం!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-11 06:41:08  IST  )

అంతరిక్షంలో నిత్యం కొన్ని కోట్ల గ్రహ శకలాలు ప్రయాణిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి గ్రహలపై పడుతూ ఉంటాయి.

ఉల్క ఢీకొట్టడంతో ఏర్పడిన భారీ క్రేటర్‌.. భూమిపై జీవరాశుల ఆవిర్భానికి సంబంధం!
X

దిశ, వెబ్ డెస్క్: అంతరిక్షంలో నిత్యం కొన్ని కోట్ల గ్రహ శకలాలు ప్రయాణిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి గ్రహలపై పడుతూ ఉంటాయి. మన సౌర వ్యవస్థలో ఇది అతి సామాన్యమైన విషయం. ఇక ఆస్టరాయిడ్ భూమిని ఢీకొంటే.. జీవి వైవిద్య వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. పశ్చిమ ఆస్ట్రేలియాకు (Western Australi) చెందిన శాస్త్రవేత్తలు తాజాగా భూమిపై ఏర్పడిన అతి పురాతనమైన భారీ క్రేటర్‌ను (crater) గుర్తించారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిల్బారా ప్రాంతంలో ఉల్క ఢీకొనటంతో ఏర్పడిన భారీ క్రేటర్‌ను కనుగొన్నారు. ఈ ఉల్క 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిని ఢీ కొట్టిందని, దాని వల్లే ఈ భారీ క్రేటర్ ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (GSWA), కర్టిన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ పరిశోధకులు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని కనుగొన్నారు.

ఈ భారీ క్రేటర్ భూమిపై జీవరాశుల తొలి దశను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. పిల్బారా ప్రాంతంలో ఏర్పడిన ఎర్రటి రాతి నిర్మాణమైన క్రేటర్‌లో వృక్షజాలం చాలా తక్కువ ఉన్నట్లు పేర్కొన్నారు. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. క్రేటర్ ప్రభావం భూమి ఉపరితలంపై తీవ్ర ప్రభావాన్ని చూపి ఉంటుందని, జీవరాశుల ఆవిర్భానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే అవకావం ఉందని వెల్లడించింది.

కర్టిన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ టిమ్ జాన్సన్ మాట్లాడుతూ.. ఈ క్రేటర్ భూమి ప్రాచీన చరిత్రకు సంబంధించిన గత అంచనాలను గణనీయంగా సవాలు చేసిందన్నారు. భూమిపై ఇప్పటివరకు కనుగొన్న క్రేటర్లలో 2.2 బిలియన్ సంవత్సరాల క్రేటర్ ప్రపంచంలో అతి పురాతనమైనదిగా ఉండగా, ప్రస్తుతం కనుగొన్న క్రేటర్ దానికంటే ముందు ఏర్పడినట్లుగా తెలిపారు. గ్రహ శకలం ఢీకొన్నప్పుడు ఏర్పడిన విలక్షణమైన రాతి నిర్మాణాల కారణంగా పరిశోధకులు ఈ బిలాన్ని కనుగొన్నట్లు తెలిపారు. పిల్బారా ప్రాంతంలో ఏర్పడిన ఈ ఎర్రటి రాతి నిర్మాణాలు గంటకు 36,000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ఒక ఉల్క ఆ ప్రాంతాన్ని ఢీకొట్టినప్పుడు ఏర్పడ్డినట్లు చెప్పారు. అలాగే, భూమిపై ఇలాంటి పురాతనమైన క్రేటర్లు భవిషత్యుల్లో మరిన్ని కనుగొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Next Story