టికెట్ తనిఖీలో హైడ్రామా.. టీటీఈ, మహిళా ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వాదం

by Ramesh Naini |

అస్సాంలోని టిన్‌సుకియా మీదుగా వెళ్తున్న ఓ రైలులో మహిళా ప్రయాణికురాలు, టీటీఈకి మధ్య ఘర్షణ చెలరేగింది.

టికెట్ తనిఖీలో హైడ్రామా.. టీటీఈ, మహిళా ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అస్సాంలోని టిన్‌సుకియా మీదుగా వెళ్తున్న ఓ రైలులో మహిళా ప్రయాణికురాలు, టీటీఈకి మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న సదరు మహిళను టీటీఈ టికెట్ అడగడంతోనే ఈ వాగ్వాదం మొదలైనట్లు తెలుస్తోంది. వైరల్ వీడియో ప్రకారం.. టీటీఈ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని (వేధింపులకు గురి చేశారని) ఆరోపిస్తూ ఆయనపై దాడికి దిగినట్లు సమాచారం. అదే క్రమంలో టీటీఈ నెట్టివేయడంతో ఆ మహిళ కింద పడిపోయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో మహిళ ఫోన్ చేతపట్టుకుని తీవ్ర ఆగ్రహంతో వాదిస్తుండగా, టీటీఈ కొంత సంయమనంతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో రైలులోని తోటి ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణ పూర్తయి వాస్తవాలు పూర్తిగా వెల్లడయ్యే వరకు ఎలాంటి ముందస్తు అంచనాలకు, నిర్ధారణలకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Next Story