- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై డాక్టర్ల వీరంగం.. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, బీరు తాగుతూ హల్‌చల్!
ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తూ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తూ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై ముగ్గురు వ్యక్తులు ఒకే బైక్‌పై వెళ్తూ, అందులో ఒకరు మద్యం తాగుతూ హల్‌చల్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో పట్టుబడిన ముగ్గురూ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగులు, యువత ఎక్కువగా నివాసం ఉండే బీటీఎం (BTM) లేఅవుట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు ఒకే ద్విచక్ర వాహనంపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ట్రాఫిక్‌లో ఇష్టానుసారంగా దూసుకెళ్లారు. వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు మధ్యలో కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదు. అయితే, చివరన కూర్చున్న వ్యక్తి మాత్రం హెల్మెట్ ధరించి, చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని దర్జాగా తాగుతూ వీరంగం సృష్టించాడు. ఇది గమనించిన వెనుక వస్తున్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. రోడ్డు భద్రతా నియమాలను గాలికొదిలేసి.. పాదచారులు, ఇతర వాహనదారులకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన వీరి తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై బెంగళూరు సిటీ పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, బైక్ నంబర్ ఆధారంగా ఆ ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో వారు నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లని తేలింది. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, బెంగళూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వారం రోజుల (మార్చి 16 నుంచి 22 వరకు) ప్రత్యేక డ్రైవ్‌లో ఏకంగా 634 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, అతివేగంతో వాహనాలు నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ.1.29 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు అధికార వర్గాల సమాచారం.






