లక్నోలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ ధర్నా.. హైలైట్‌గా నిలిచిన ‘UP CM యోగి’ ఎంట్రీ!

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-12 08:47:47  IST  )

పరీక్షల పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ (C.JP)' లక్నోలోని ఎకో గార్డెన్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది.

లక్నోలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ ధర్నా.. హైలైట్‌గా నిలిచిన ‘UP CM యోగి’ ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: పరీక్షల పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ (C.JP)' లక్నోలోని ఎకో గార్డెన్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో లక్నో పోలీసులు ఎకో గార్డెన్ పరిసరాలను ఒక కోటలా మార్చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఒక ఆసక్తికరమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పోలి ఉన్న ఒక యువకుడు కాషాయ వస్త్రాలు ధరించి ఈ ధర్నాలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం యోగి రూపంలో ఉన్న సదరు యువకుడు విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నిరసనకారుల ముందు నిలబడటంతో.. అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మీడియా ప్రతినిధులు, పోలీసులు సైతం అతడిని ఆసక్తిగా గమనించారు. ఆ యువకుడి సమక్షం ఈ నిరసనలో హైలైట్‌గా మారింది.

అధికారిక నిరాకరణ..

ఈ నిరసన ప్రదర్శనకు స్థానిక యంత్రాంగం, పోలీసులు అధికారికంగా అనుమతి నిరాకరించారు. నిర్వాహకులు అవసరమైన నిబంధనలను పాటించలేదని, సరైన సమన్వయం లేకపోవడం వల్లే అనుమతి ఇవ్వలేదని సినియర్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, అనుమతి లేకపోయినప్పటికీ దేశంలోని యువత భవిష్యత్తు కోసం తాము పోరాడుతామని చెప్తూ.. విద్యార్థి సంఘాలు, సీజేపీ (CJP) మద్దతుదారులు ఏకో గార్డెన్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నిరసనపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఢిల్లీ, పూణే నగరాల్లో తమ నిరసనలు విజయవంతంగా సాగాయని, ఈ క్రమంలో లక్నో నిరసన చాలా కీలకమైనదనీ పేర్కొన్నారు. నీట్ (NEET-UG), సీబీఎస్ఈ (CBSE), సీయూఈటీ (CULT) పరీక్షలు రాసిన సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్యాయానికి వ్యతిరేకంగా తాము ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి మాకున్న ఏకైక డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే. ప్రధాని నరేంద్ర మోడీ కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా. లేక ఒక్క అసమర్థ మంత్రి ముఖ్యమా అనేది తేల్చుకోవాలి అని అభిజీత్ వ్యాఖ్యానించారు.

Next Story