విరిగిపడిన కొండచరియలు.. 67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క

by Yella Dhawani Reddy |

భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు హిమాచల్‌ప్రదేశ్‌ను అతలకుతలం చేస్తున్నాయి.

విరిగిపడిన కొండచరియలు.. 67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క
X

దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు హిమాచల్‌ప్రదేశ్‌ను అతలకుతలం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు వర్షాల కారణంగా 75 మంది మరణించగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. కొన్నిచోట్ల రహదారులు, వంతెనలు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్‌, టెలికం లైన్లు ధ్వంసమవడంతో సంబంధిత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థకూ అంతరాయం కలిగింది. ఈ భయానక పరిస్థితుల్లో ఒక కుక్క అరుపు.. 67 మంది ప్రాణాలను కాపాడింది (Dogs Bark Saves Lives).

మండి జిల్లాలోని సియతి గ్రామంలో జూన్ 30న అర్ధరాత్రి భారీ వర్షం కురవటంతో పెద్ద కొండచరియ విరిగిపడింది. దీంతో గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, గ్రామస్థుల ప్రాణాలను మాత్రం ఓ కుక్క కాపాడింది. ఎలాగంటే.. గ్రామంలోని నరేంద్ర అనే గ్రామస్థుడి ఇంటి రెండో అంతస్థుపై ఓ కుక్క రోజు పడుకుంటుంది. ఈ క్రమంలో ఆరోజు ఉన్నట్టుండి వివపరీతంగా అరవటం మొదలుపెట్టింది. ఏమైందో అని నరేంద్ర నిద్ర లేచి వచ్చి చూడగా, ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. వెంటనే కుక్కను కిందికి తీసుకెళ్లి, అందరినీ నిద్ర లేపాడు. ఇంటి చుట్టుపక్కల వాళ్ల ఇళ్లకు వెళ్లి వారిని కూడా లేపి, సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాడు. వారు వెళ్లిన క్షణాల్లోనే గ్రామంపై కొండచరియ విరిగిపడింది. పదుల సంఖ్యలో ఇళ్లు దానికింద నేలమట్టం అయ్యాయి. ఒక నాలుగైదు ఇళ్లు మాత్రం దెబ్బతినకుండా కనిపించాయి. ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు.

Next Story