మానవత్వాన్ని కాపాడలేకపోయిన పేదరికం.. సహాయం చేసినందుకు జైలుశిక్ష

by Naga Rani Yarlagadda |

మనం మంచి చేయాలనుకుంటే.. కొన్ని సందర్భాల్లో అదే మనకు కష్టాలు తెచ్చిపెడుతుంది.

మానవత్వాన్ని కాపాడలేకపోయిన పేదరికం.. సహాయం చేసినందుకు జైలుశిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: మనం మంచి చేయాలనుకుంటే.. కొన్ని సందర్భాల్లో అదే మనకు కష్టాలు తెచ్చిపెడుతుంది. ప్రమాదంలో ఉన్న మహిళకు సహాయం చేయబోయి జైలుపాలయ్యాడో వ్యక్తి. చేయని తప్పుకి 13 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అతడి పేదరికం ముందు మానవత్వం ఓడిపోయింది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఆదర్శనగర్ కు చెందిన రాజేశ్ విశ్వకర్మ రోజువారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మురికివాడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే జీవనం సాగించేవాడు. గతేడాది అనారోగ్యంతో బాధపడుతున్న పొరిగింటి మహిళను ఆస్పత్రిలో చేర్చాడు. ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో.. వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.

రాజేషే ఆమెను చంపి ఉంటాడని అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా.. భయం భయంగానే సమాధానమిచ్చాడు. దాంతో తమ అనుమానమే నిజమనుకుని అరెస్టు చేశారు. 9 రోజులవరకూ రాజేష్ అరెస్ట్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. పేదవాడు కావడంతో వాదించేందుకు లాయర్లు కూడా ముందుకు రాలేదు. దీంతో కోర్టు ఈ కేసును ప్రభుత్వ లాయర్ కు అప్పగించింది. ఆయన రాజేశ్ ను జరిగిన విషయాన్ని చెప్పమని అడగడంతో తను చేసిన సహాయం గురించి వివరించాడు. మెడికల్ రిపోర్టుల పరంగా కూడా ఆమె అనారోగ్యంతోనే మరణించిందని ఉంది. కానీ పోస్టుమార్టంలో మాత్రం గొంతుకోసి చంపినట్లు రావడంతో లాయర్ కు ఏమీ అర్థం కాలేదు.

కేసు విచారణలో భాగంగా పోలీసుల్ని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడైంది. పోలీసులు, పోస్టుమార్టం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదం జరిగిందన్న విషయాన్ని గుర్తించి, ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. రాజేష్ ను నిర్దోషిగా గుర్తించిన కోర్టు వెంటనే రిలీజ్ చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. కాగా.. తాను జైలుకు వెళ్లడంతో తన కుటుంబం రోడ్డున పడిందని, తన జీవితం మరింత దారుణంగా తయారైందని వాపోతున్నాడు. జైలుకు వెళ్లాడన్న విషయం అందరికీ తెలియడంతో ఎవరూ పనివ్వడం లేదని, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రభుత్వమే దారి చూపాలని కోరుతున్నాడు.

Next Story