అంతసేపు నిల్చుంటే అలసిపోతావు నాన్నా.. చిన్నారిపై ప్రధాని మోడీ ఆప్యాయత.. వైరల్

by Ramesh Naini |

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

అంతసేపు నిల్చుంటే అలసిపోతావు నాన్నా.. చిన్నారిపై ప్రధాని మోడీ ఆప్యాయత.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. గురువారం తిరువనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మోడీ.. జనసందోహంలో తన చిత్రపటాన్ని పట్టుకొని నిలుచున్న ఓ చిన్నారిని చూసి చలించిపోయారు. ప్రసంగం మధ్యలో ఆ బాలుడిని ఉద్దేశించి మోడీ మాట్లాడిన తీరు అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. సభలో ప్రసంగిస్తుండగా మోడీ దృష్టి ఆ బాలుడిపై పడింది. చాలా సేపటి నుంచి ఆ బాలుడు మోడీ చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని నిల్చొనే ఉన్నాడు. అది గమనించిన ప్రధాని.. కాసేపు తన ప్రసంగాన్ని ఆపి, ఆ బాలుడిని ఆప్యాయంగా పలకరించారు.

నీ చిరునామా రాసి నాకివ్వు..

‘చాలాసేపటి నుంచి ఆ చిన్నారి నా ఫోటో పట్టుకొని నిల్చొనే ఉన్నాడు. అంతసేపు నిల్చుంటే అలసిపోతావు నాన్నా. ఆ ఫోటో వెనుక నీ ఇంటి చిరునామా రాసి నాకివ్వు. నేను నీకు కచ్చితంగా లేఖ రాస్తాను’ అని మోడీ హామీ ఇచ్చారు. ఈ మాటలు వినగానే సభ ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. అనంతరం తన భద్రతా సిబ్బంది (SPG)ని పిలిచి.. ఆ బాలుడి దగ్గరున్న చిత్రాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని ఆదేశించారు. ‘ఆ చిత్రం ఆ బాలుడి ప్రేమకు, ఆశీర్వాదాలకు నిదర్శనం. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి’ అని సిబ్బందికి సూచించారు.

మహిళ అభిమానిపై కూడా..

ఇదే సభలో మరో మహిళ కూడా మోడీకి ఏదో ఇవ్వాలని ప్రయత్నించడాన్ని ప్రధాని గమనించారు. ఆమె ఒక పెద్ద పుస్తకాన్ని నాకోసం తెచ్చినట్లున్నారు.. అని మోడీ ప్రస్తావించారు. కార్యకర్తల అభిమానాన్ని ప్రధాని గుర్తించి, స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story