దారుణం: చిన్న వివాదానికే బస్సు డ్రైవర్‌పై కర్రలతో దాడి!

by Ramesh Naini |

మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా-భయందర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది.

దారుణం: చిన్న వివాదానికే బస్సు డ్రైవర్‌పై కర్రలతో దాడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా-భయందర్ (MBMC) ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్‌లో బైక్‌కు తగిలిందన్న కారణంతో ఓ మున్సిపల్ బస్సు డ్రైవర్‌పై ఐదారుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. గయ్‌ముఖ్ ఘాట్ వద్ద మున్సిపల్ బస్సును అడ్డగించిన దుండగులు, కర్రలతో బస్సులోకి చొరబడ్డారు. డ్రైవర్‌ చొక్కా లాగేసి, సీటులో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కోపర్ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ (IPC) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

నెల వ్యవధిలోనే ఇది రెండో ఘటన..

సరిగ్గా నెల రోజుల క్రితం మీరా రోడ్‌లో రమేశ్వర్ బిడ్వే అనే బస్సు డ్రైవర్‌పై కూడా ఓ బైకర్ ఇలాగే దాడి చేశాడు. ఓవర్‌టేక్ చేసే క్రమంలో జరిగిన ఆ గొడవలో దాడికి పాల్పడింది సాక్షాత్తూ బస్సు సర్వీస్ కాంట్రాక్టర్ కుమారుడే కావడంతో, అప్పట్లో కార్మికులు ఆకస్మిక సమ్మెకు దిగారు. పాత కాంట్రాక్టర్‌ను తొలగించిన మున్సిపల్ కార్పొరేషన్, ప్రస్తుతం 'మహాలక్ష్మి కృపా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' అనే స్థానిక ఏజెన్సీ ద్వారా బస్సులను తాత్కాలికంగా నడుపుతోంది. తాజా దాడితో డ్రైవర్లు, సిబ్బందిలో మరింత ఆందోళన నెలకొంది.

Next Story