బాలుడికి పాము కాటు.. తాంత్రికుడి మాట విని గంగానదిలో 12 గంటలు.. చివరకు

by Prasad Jukanti |

యూపీలో మూఢనమ్మకం ప్రాణం తీసింది. పాము కాటు వేసిన బాలుడిని తాంత్రికుడి సలహాతో 12 గంటల పాటు గంగానదిలో ఉంచడంతో పరిస్థితి విషమించి మృతి చెందాడు.

బాలుడికి పాము కాటు.. తాంత్రికుడి మాట విని గంగానదిలో 12 గంటలు.. చివరకు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తల్లిదండ్రుల మూఢనమ్మకానికి పాముకాటుకు గురైన (Snake Bite) ఓ బాలుడు నిండు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన యూపీలో (Uttar Pradesh) జరిగింది. తాంత్రికుడు చెప్పిన మాట విని తమ కుమారుడిని 12 గంటల పాటు గంగానది ప్రవాహంలో ఉంచి చివరకు అతడి శవాన్ని చూడాల్సి వచ్చింది. వింటుంటేనే కోపం, బాధ కలుగుతున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అడంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పితంపూర్ గ్రామానికి చెందిన జైరామ్ సింగ్ కుమారుడు సుర్జీత్ (14) గురువారం పొలం వద్ద బస్తాలో నుంచి గడ్డి తీస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. అతడి కేకలు విని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా ఓ తాంత్రికుడి వద్దకు తరలించారు. తన వద్దకు తీసుకు వచ్చిన బాలుడి ప్రాణాలు నిలవాలంటే బాలుడిని గంగానది ప్రవాహంలో 12 గంటల పాటు ఉంచాలని సూచించాడు. కొడుకు ప్రాణాలు దక్కుతాయనే ఆశతో ఆ బాలుడి తల పైకి ఉండి మిగతా శరీర భాగం అంతా గంగానదిలో మునిగేలా అతడి తల్లిదండ్రులు ఓ కర్రకు కట్టి తాళ్లతో వేళాడదీశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

తెరపైకి మరో అంశం:

సుర్జీత్ మరణంపై మరో వాదన సైతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. పాము కాటుకు గురైన సుర్జీత్ ను ఆతడి తల్లిదండ్రులు తొలు ఆసుపత్రికే తరలించారని కానీ అప్పటికే అతడు చనిపోవడంతో ప్రాణాలు దక్కుతాయనే ఆశతో తాంత్రికుడి వద్దకు వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ప్రాణాల కోసం ఓ తాంత్రికుడిని ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story