తమిళనాడు సర్కార్‌కు శరాఘాతం.. దీపం వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 06:38:49  IST  )

తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ షాకిచ్చింది. తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ వివాదంలో హిందూ సంప్రదాయాలకు, భక్తులకు అనుకూలంగా కీలక తీర్పును ఇచ్చింది.

తమిళనాడు సర్కార్‌కు శరాఘాతం.. దీపం వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు (Madras High Court) మధురై బెంచ్ షాకిచ్చింది. తిరుప్పరంకుండ్రం (Thirupparankundram) సుబ్రమణ్య స్వామి ఆలయ వివాదంలో హిందూ సంప్రదాయాలకు, భక్తులకు అనుకూలంగా కీలక తీర్పును ఇచ్చింది. కొండపై ఉన్న పురాతన రాతి స్తంభంపై దీపం నిర్భయంగా వెలిగించవచ్చని జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కె.కె.రామకృష్ణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో సింగిల్ బెంచ్ జడ్జి జీ.ఆర్. స్వామినాథన్ ఇచ్చిన ఆదేశాలను కూడా డివిజన్ బెంచ్ సమర్థిస్తూ.. దీపం వెలిగించడం వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందని తమిళనాడు సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌‌ను కొట్టివేసింది.

స్టాలిన్ సర్కారుకు మొట్టికాయలు..

రాతి స్తంభం దర్గాకు సుమారు 15 మీటర్ల దూరంలో ఉందని, దీపం వెలిగించడం హిందూ సంప్రదాయంలో భాగమేనని హైకోర్టు డివిజన్ బెంచ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆగమ శాస్త్రాలను ఎవరూ నిషేధించలేరని, ఇది దేవాలయ భూమిపైనే జరిగే చట్టబద్ధమైన ఆచారమని కోర్టు స్పష్టం చేసింది. తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ ఆవరణలో రాతి స్తంభంపై దీపం వెలిగించడం వల్ల శాంతి భద్రతలకు భంగం వస్తుందన్న ప్రభుత్వ వాదనను కోర్టు తీవ్రంగా ఖండించింది. కొండపై దీపం వెలిగించడం వల్ల అలాంటి అనర్థాలు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే విషయం నమ్మశక్యంగా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి భయాలే సమాజంలో అపనమ్మకాన్ని పెంచుతాయని కోర్టు, స్టాలిన్ సర్కారుకు మొట్టికాయలు వేసింది. ప్రతి సంవత్సరం దేవదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవంలో ఆ రాతి స్తంభంపై దీపం వెలిగించాలని కోర్టు ఆదేశించింది. దీపం వెలిగించే సమయంలో ప్రజలను అనుమతించకూడదని, జిల్లా కలెక్టర్ స్పాట్‌లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)తో సంప్రదించి వివరాలను నిర్ణయించాలని కూడా ఆదేశించింది. తాజాగా వచ్చిన ఈ కోర్టు తీర్పును అశేష హిందూ భక్తుల అద్భుత విజయంగా పలు హిందూ సంఘాల నేతలు అభివర్ణిస్తున్నారు.

Read More..

బంగ్లాదేశ్‌లో ఆగని మారణహోమం.. ఒకే రోజు ఇద్దరు హిందువుల దారుణ హత్య

Next Story