Indian Fishermen: 8 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం

by S Gopi |

ఈ అరెస్టుతో 2025లో ఇప్పటివరకు 18 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేశామని శ్రీలంక నేవీ అధికారులు స్పష్టం చేశారు.

Indian Fishermen: 8 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్న ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసినట్టు శ్రీలంక నేవీ ఆదివారం ప్రకటనలో తెలిపింది. వారితో పాటు రెండు ఫిషింగ్ ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మన్నార్‌కు ఉత్తరాన సముద్ర ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ సందర్భంగా శనివారం రాత్రి మత్స్యకారుల అరెస్ట్ జరిగిందని శ్రీలంక నావికాదళం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ అరెస్టుతో 2025లో ఇప్పటివరకు 18 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేశామని, మూడు ట్రాలర్లను జప్తు చేసినట్టు పేర్కొన్నారు. మత్స్యకారులతో పాటు పట్టుకున్న పడవలను ఇరానతీవు ద్వీపానికి తీసుకువచ్చామని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం వారిని కిలినొచ్చిలోని అసిస్టెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిషరీస్‌కు అప్పగించనున్నట్టు శ్రీలంక నేవీ అధికారులు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా భారత్, శ్రీలంక మధ్య మత్స్యకారుల సమస్య తరచూ వివాదాస్పదంగా మారుతోంది. శ్రీలంక నేవీ సిబ్బంది పాక్ జలసంధిలో భారతీయ మత్స్యకారులపై కాల్పులు సైతం జరిపారు. శ్రీలంక సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే కారణంతో పలు సంఘటనల్లో వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ జలసంధి శ్రీలంక నుంచి తమిళనాడును వేరుచేసే ఇరుకైన నీటి పాయ. రెండు దేశాల మత్స్యకారుల చేపల వేటకు ఇది సరైన చోటు కావడంతో రెండు దేశాలకు చెందిన మత్స్యకారులు అనుకోకుండా ఒకరి జలాల్లోకి మరొకరు చొరబడుతున్న ఘటనలు తరచుగా జరుగుతోంది. తద్వారా మత్స్యకారులు అరెస్ట్ అవుతున్నారు. 2024లో శ్రీలంక నావికాదళం 529 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక సముద్ర జలాల్లో వేటాడిన ఆరోపణలతో అరెస్టు చేసింది.

Next Story