- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
At Home Invitation : గణతంత్ర వేడుకలు.. ఆ రాష్ట్రాల వైభవంతో ‘ఎట్ హోమ్’ ఆహ్వాన పత్రిక
భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే సంప్రదాయ ‘ఎట్ హోమ్’ (At-Home) కార్యక్రమం కోసం రూపొందించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విడుదల చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే సంప్రదాయ ‘ఎట్ హోమ్’ (At-Home) కార్యక్రమం కోసం రూపొందించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విడుదల చేశారు. ఈ విశిష్ట ఆహ్వాన పత్రికకు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను ఆమె తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది ఆహ్వాన పత్రికను భారత ఈశాన్య రాష్ట్రాలైన (అష్టలక్ష్మి) ప్రాంతపు అపురూప సంస్కృతి, కళా వైభవం ప్రతిబింబించేలా అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈశాన్య భారతంలోని (అష్టలక్ష్మి) ఎనిమిది రాష్ట్రాల జీవన సంప్రదాయాలను, అక్కడి అద్భుతమైన చేతివృత్తుల కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఇన్విటేషన్ కిట్‌ను రూపొందించినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు.
అష్టలక్ష్మి రాష్ట్రాల నైపుణ్యం
‘ఈ ఏడాది ఆహ్వాన పత్రిక ఈశాన్య భారత జీవన సంప్రదాయాలను వేడుకలా జరుపుకుంటోంది. అష్టలక్ష్మి రాష్ట్రాల నైపుణ్యం కలిగిన కళాకారులకు, చేతివృత్తుల వారికి ఇది మేము అర్పిస్తున్న గౌరవ నివాళి’ అని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో దేశ విదేశీ ప్రముఖుల కోసం ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుక కోసం పంపే ఆహ్వాన పత్రిక ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈశాన్య రాష్ట్రాల హస్తకళలు, నేత కళలు, ఆ ప్రాంతపు సహజ సిద్ధమైన అందాలను తలపించేలా ఉన్న ఈ డిజైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.






