- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Republic Day Parade: ప్రధాన ఆకర్షణగా నారీశక్తి కవాతు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా..
గణతంత్ర దినోత్సవం(Republic Day Parade) ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో నిర్వహించిన కవాతులో నారీశక్తి(Nari Shakti) ప్రధాన ఆకర్షణగా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: గణతంత్ర దినోత్సవం(Republic Day Parade) ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో నిర్వహించిన కవాతులో నారీశక్తి(Nari Shakti) ప్రధాన ఆకర్షణగా మారింది. దేశ చరిత్రలో తొలిసారిగా వందమంది మహిళలు కర్తవ్యపథ్ లో పరేడ్ ను ప్రారంభించారు. శంఖం, నాదస్వరం, నగాడ వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కవాతు నిర్వహించారు. త్రివిధ దళాల్లో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ రవీందర్‌జీత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు. 'నారీ శక్తి' బలం, పరాక్రమాన్ని సూచిస్తూ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) నిర్వహించిన కవాతుకు మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. అధునాతన రక్షణ సాంకేతికతల ద్వారా దేశ భద్రతను బలోపేతం చేయడంలో అతివలు అందించిన కీలకమైన సహకారాన్ని అందులో ప్రదర్శించారు. అసిస్టెంట్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటి కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్‌లో పాల్గొన్నాయి. సుమారు 15మంది మహిళా పైలట్ల బృందం ఫ్లై-పాస్ట్‌లో తమ ప్రతిభను చూపారు.
మహిళా సాధికారతకు చెందిన 26 శకటాలు
కవాతులో 16 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు సందడి చేశాయి. వీటిలో మహిళా సాధికారత అంశాన్ని ప్రతిబింబించేవి 26 ఉన్నాయి. మణిపుర్‌లో తామర పూల కాడలలోని సున్నితమైన నారలతో చీరలు తయారు చేసే మహిళలు, పడవలు నడుపుతున్న స్త్రీలు, హస్తకళలు, చేనేత సహా వివిధ రంగాల్లో ప్రఖ్యాతి పొందిన వారికి సంబంధించిన విషయాలను ప్రదర్శించారు.






