Kerala: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఆరు జిల్లాల్లో హైఅలర్ట్

by S Gopi |

దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Kerala: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఆరు జిల్లాల్లో హైఅలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. ఈ వారం ప్రారంభంలో పాలక్కడ్‌లో రెండో నిఫా వైరస్ మరణం నమోదైంది. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందిని ఎదుర్కొంటూ 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అనంతరం జరిగిన ప్రాథమిక పరీక్షల్లో అతనికి నిఫా ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మొత్తం ఆరు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 675 మంది నిఫా వైరస్‌కు కాంటాక్ట్ అయినట్టు ప్రభుత్వం భావిస్తోంది. వీరిలో 178 మంది పాలక్కాడ్ జిల్లా నుంచే ఉన్నారు. వీరు ఇటీవల మరణించిన రెండో నిఫా కేసుతో ముడిపడి ఉన్నట్టు సమాచారం. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, ప్రస్తుత కాంటాక్ట్‌ అయిన వారు మలప్పురం జిల్లాలో 210, పాలక్కడ్‌లో 347, కోజికోడ్‌లో 115, ఎర్నాకుళంలో ఇద్దరు, త్రిస్సూర్‌లో ఒకరు ఉన్నారు. ఇప్పటివరకు, మలప్పురంలో ఒక వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, జిల్లాలో 82 నమూనాలను పరీక్షించగా నెగటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. విడిగా, పాలక్కడ్‌లో 12 మంది వ్యక్తులకు ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఐదుగురిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం, రాష్ట్రంలో మొత్తం 38 మంది అత్యంత ప్రమాదకర స్థితిలో పరిశీలనలో ఉండగా, 139 మంది ప్రమాదకర స్థితిలో ఉన్నారు. నిఫా వైరస్ కారణంగా వ్యక్తి మరణించినప్పటి నుంచి కేరళలోని ఆరు జిల్లాలు - పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, త్రిస్సూర్, కాన్నూర్, వయనాడ్‌లను హై అలర్ట్‌లో ఉంచారు. ఆరోగ్య శాఖ అధికారులు నిఘా, నియంత్రణ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ముమ్మరం చేశారు.

Next Story