'బ్యాంకుల్లో బానిసత్వం' పదేళ్లలో 500 ఆత్మహత్యలపై రాజ్యసభలో ఆందోళన

by Prasad Jukanti |   (  Updated:2026-02-12 09:55:33  IST  )

ఉద్యోగం ఒత్తిడి కారణంగా ఇటీవల ప్రభుత్వ బ్యాంకు సెక్టార్ లో పెరిగిపోతున్న సిబ్బంది ఆత్మహత్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఓ ఎంపీ కోరారు.

బ్యాంకుల్లో బానిసత్వం పదేళ్లలో 500 ఆత్మహత్యలపై రాజ్యసభలో ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకులో పని పరిస్థితులపై రాజ్యసభలో ఆందోళన వ్యక్తం అయింది. ఈ రంగంలో పనిచేస్తున్న వారి దారుణంగా ఉందని కేరళకు చెందిన సీపీఐ(ఎం) ఎంపీ ఏఏ రహీం గురువారం రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి, వేధింపుల కారణంగా గత దశాబ్ద కాలంలో 500 మంది బ్యాంకు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇవాళ సభలో జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. పెరుగుతున్న పని ఒత్తిడిని అసాధ్యమైన టార్గెట్‍లను తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగులు తమ ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్న అనేక సంఘటనలు ఉన్నాయన్నారు. ‘తాను ఇక భరించలేకపోతున్నాను. నాకు జీవించాలనే కోరిక పోయింది’ అంటూ గుజరాత్‌లోని ఒక బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకునే ముందు ఉన్నతాధికారికి ఫోన్‌లో చెప్పిన ఉదంతాన్ని ఎంపీ సభలో ప్రస్తావించారు.

ఉద్యోగులు తీవ్రంగా అలసిపోయారు:

2021, 2024 మధ్య జరిగిన అనేక సంఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ.. యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఉరి వేసుకుని తన సూసైడ్ నోట్‌లో సిబ్బందికి అసాధ్యమైన లక్ష్యాలను కేటాయించకూడదని అని రాశారని గుర్తు చేశారు. తమిళనాడులోని ఒక బ్రాంచ్ మేనేజర్ ఏడాది వయసున్న కుమార్తెను వదిలి తన జీవితాన్ని ముగించగా, 38 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ కేరళలోని కన్నూర్‌లోని ఒక బ్యాంకులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె సూసైడ్ నోట్‍లో పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. విపరీతమైన పని ఒత్తిడి, సిబ్బంది కొరతతో బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా అలసిపోయారన్నారు.

32,567 పోస్టులు ఖాళీ:

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రాత్రిపూట కూడా బ్యాంకు ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో అందించిన డేటా ప్రకారం జూన్ 2025 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే 32,567 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యాపారాలు, శాఖల సంఖ్య పెరుగుతోంది కానీ సిబ్బంది సంఖ్య తగ్గుతోందని ఆదోళన వ్యక్తం చేశారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన టార్గెట్‍లతో పాటు, ప్రైవేట్ బీమా, మ్యూచువల్ ఫండ్స్ వంటి థర్డ్ పార్టీ ఉత్పత్తులను విక్రయించడానికి బ్యాంకు ఉద్యోగులకు అవాస్తవిక లక్ష్యాలను కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులు తమ రోజువారీ లక్ష్యాన్ని సాధించకుండా రాత్రిపూట కూడా బ్యాంకు నుండి బయటకు రాకుండా బలవంతం చేయబడుతున్నారని భారత ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో బానిసత్వాన్ని ఆపేలా కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

Next Story