Iraq: ఇరాక్‌లోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 55 మంది మృతి

by S Gopi |   (  Updated:2025-07-17 11:36:48  IST  )

ఐదు రోజుల క్రితమే ఈ మాల్‌ను తెరిచారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు

Iraq: ఇరాక్‌లోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 55 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాక్‌లోని అల్-కుట్ నగరంలో ఉన్న ఒక హైపర్ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 55 మంది దాకా మరణించారని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది. మరణించిన వరిలో చిన్నారులే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఐదు రోజుల క్రితమే ఈ మాల్‌ను తెరిచారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, దర్యాప్తు ద్వారా ప్రాథమిక వివరాలను 48 గంటల్లో ప్రకటిస్తామని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. అలాగే, షాపింగ్ మాల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడి వార్తా ఛానెల్‌లోని వీడియోలను చూస్తే భవనంలోని అనేక అంతస్తులు మంటల్లో చిక్కుకున్నట్టుగా ఉంది, అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను బట్టు మాల్‌లో మంటల చెలరేగిన సమయంలో పైకప్పుపై కొందరు ప్రజలు ఉన్నట్టు, మాల్ లోపలి భాగం కాలిపోతున్న దృష్యాలు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది రక్షించిన క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు అంబులెన్స్‌లలో తరలించారు. ఓ బాధితుడు ఈ ప్రమాదంలో ఐదుగురు కుటుంబసభ్యులను కోల్పోయినట్టు విలపించాడు. తాము విద్యుత్ కోతలను తప్పించుకునేందుకు, డిన్నర్ చేసేందుకని మాల్‌కి వచ్చినట్టు అతను చెప్పాడు.

Next Story